Barrages on Krishna River :ఈ ఏడాది కృష్ణా నదికి వరద పోటెత్తింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వరద ఇంకా కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వందల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. కొన్నేళ్లుగా కృష్ణానదికి ఇంత భారీస్థాయిలో వరద రావట్లేదు. ఎగువ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత కొద్దోగొప్పో నీరు కిందికి వచ్చేది.
ఫలితంగా కృష్ణా డెల్టా రైతులు సాగు నీటికి తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. దీన్ని నివారించేందుకు వరద పోటెత్తిన సమయంలో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువన గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడూ బ్యారేజీలను ప్రతిపాదించారు. ప్రకాశం బ్యారేజీ ఎగువున వైకుంఠపురం వద్ద ఒక బ్యారేజీ, దిగువన మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని ప్రతిపాదించారు. పెనమలూరు మండలం చోడవరం వద్ద మొదటి బ్యారేజీ ప్రతిపాదించారు. ఇది మంగళగిరి మండలం రామచంద్రాపురం వరకు ఉంటుంది.
ప్రకాశం బ్యారేజీకి దిగువన 16 కిలోమీటర్ల వద్ద ఈ బ్యారేజీని నిర్మించి 2.7 టీఎంసీల నీటిని నిలువ చేయాలనేది ఆలోచన. ఇందుకు 2235.42కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. రెండో బ్యారేజీని మోపిదేవి మండలం బండికొల్లంక, రేపల్లె మండలం తూర్పుపాలెం వద్ద ప్రకాశం బ్యారేజీకి 67 కిలోమీటర్ల దిగువన నిర్మించి 4.7 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలనేది ఆలోచన. దీనికి 2వేల 526 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వీటిని పక్కన పెట్టేసింది.
ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం చంద్రబాబు - కృష్ణమ్మ పరవళ్లు చూసి పులకరింత! - CM Watches Prakasam barrage floods
ప్రభుత్వం మారిన తర్వాత వైకుంఠపురం బ్యారేజీ ప్రతిపాదనను తిరస్కరించారు. దిగువన రెండు బ్యారేజీలకు మంత్రివర్గంలో ప్రతిపాదించి ఆమోదముద్ర వేశారు. కృష్ణా నది సముద్రంలో హంసలదీవి ప్రాంతంలో కలుస్తుంది. దీంతో దివిసీమ ప్రాంతం ఉప్పునీటి మయంగా మారుతోంది. సముద్రపు నీరు కృష్ణా నదికి ఎగదన్నుతోంది. దీంతో కృష్ణా నది తీర ప్రాంతం ఉప్పునీటి మయంగా మారుతోంది.
దీన్ని నియంత్రించేందుకు నదిలో చెక్‌డ్యామ్ తరహాలో నీటిని నిలువ చేసి అడ్డుకట్టలు వేయాలని ప్రతిపాదించారు. దీని వల్ల గుంటూరు, కృష్ణా జిల్లా రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 2020లో అప్పటి సీఎం జగన్ కృష్ణా నదిపై నిర్మించే రెండు బ్యారేజీలకు త్వరలో టెండర్లు పిలుస్తున్నామని, ఏడాదిలో నిర్మాణం పూర్తి చేస్తామని, రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మాట తప్పారు.
బ్యారేజీలు నిర్మిస్తే కృష్ణా జిల్లాకు గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి అనుసంధానం పెరుగుతుంది. వరద నీటిని ఒడిసిపట్టడం వల్ల తాగునీటి సమస్యలు తీరుతాయి. సరకు రవాణా, పర్యాటకం, నదీముఖ అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణతో ముందడుగు వేయాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
"ఇక్కడ చెక్ డ్యామ్‌లు కట్టడం వలన భవిష్యత్తులో రాజధాని అమరావతి అవసరాల కోసం ఉపయోగపడుతుంది. అదే విధంగా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ప్రతి రైతు నీరు కోసం ఇబ్బందులు పడకుండా ఉంటారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవి కట్టాలని నిర్ణయించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని నిర్మిస్తుందని అనుకుంటున్నాం". - స్థానికులు
పోలవరం టార్గెట్ ఫిక్స్- 2027 మార్చిలోగా పూర్తి చేసేలా షెడ్యూల్ :చంద్రబాబు - Polavaram Project Construction