Badvel Inter Student Attack Case :వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతిచెందింది కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించింది. శనివారం నాడు విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలిచంగా చికిత్స పొందతూ ఇవాళ చనిపోయింది. మరోవైపు నిందితుడు విఘ్నేశ్‌ను బద్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థిని మృతి విషాదకరం : కడప జిల్లాలో విద్యార్థిని మృతి విషాదకరమని హోం మంత్రి అనిత తెలిపారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నిందితుడికి, అతడికి సహకరించిన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని వివరించారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామి హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.
స్నేహితుడి ముసుగులో విఘ్నేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కలవడానికి రమ్మని చెప్పి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపిన మేరకు బాధిత బాలిక (16) ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న విఘ్నేష్‌తో చిన్నప్పటి నుంచీ స్నేహం ఉంది. అతడికి వివాహం కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి ఫోన్ చేసి శనివారం తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.