జగన్ పాలనలో దేవుళ్లకే భద్రత లేదు - రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల కూల్చివేతలు Attacks on Temples During Jagan Government:దేవాలయాలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా జగన్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క చర్యా తీసుకోవట్లేదు. దేవస్థానాల్లో వేలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటూ ప్రగల్భాలే తప్ప అసలు అవి పనిచేస్తున్నాయో లేదో పట్టించుకునే దిక్కు లేదు. అన్నిచోట్లా భద్రతా ఆడిట్ చేసేశామంటూ ఆర్భాటపు ప్రకటనలిచ్చారు కానీ ఆలయాల్ని కొల్లగొడుతుంటే అడ్డుకునేవారు లేరు. ఈ లెక్కలేనితనం ఫలితంగానే ఆలయాలపై దాడులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా అమరావతిలోని ప్రఖ్యాత అమరరామలింగేశ్వరస్వామి ఆలయంలో చోరీ ఘటన జగన్ జమానాలో దేవాలయాల్లో భద్రత లేమిని చెప్పకనే చెబుతోంది.
కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు - దారికాచి మరీ టీడీపీ నేతపై దాడి
కట్టుకథలు చెప్తున్న పోలీసులు:విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలనరికేసిన ఘటన జరిగి మూడేళ్ల మూడు నెలలవుతోంది. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించినా నిందితులెవరో కూడా ఇప్పటివరకూ తేల్చలేకపోయారు. అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి దివ్యరథం దహనమై మూడున్నరేళ్లవుతోంది దానిపై మొదట్లో ఏవేవో కట్టుకథలు చెప్పిన పోలీసులు తర్వాత ఆ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని చేతులు దులిపేసుకున్నారు. కానీ సీబీఐ మాత్రం కేసు దర్యాప్తు చేపట్టలేదు.
బిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి దివ్యరథానికి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నిప్పంటించాడని తేల్చేసి, ఆ కేసును అటకెక్కించేశారు. మతిస్థిమితం లేని వ్యక్తులు, మద్యం మత్తులో ఉన్నవారు ఈ దాడులకు పాల్పడ్డారంటూ చాలా కేసుల్ని పోలీసులు తేల్చేశారు. మూఢ నమ్మకాలు, గుప్తనిధుల కోసం ఈ దారుణాలకు ఒడిగట్టారంటూ మరికొన్ని కేసుల్ని నీరుగార్చేశారు. కొన్ని ఘటనల్లో అసలు కేసులే నమోదు చేయలేదు. మరికొన్ని ఘటనల్లో ఏళ్లు గడుస్తున్నా నిందితుల్ని పట్టుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఈ విధ్వంసాలను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిపక్ష పార్టీల నాయకులకే ఆ నేరాన్ని ఆపాదింజేయడం వారి పాపాలకు పరాకాష్ఠగా చెప్పాలి.
వాలంటీర్ వేధింపులు తాళలేకే బాలిక ఆత్మహత్యాయత్నం: జనసేన
జగన్ పుణ్యమా అని దర్జాగా గడిపేస్తున్న దుండగులు:2020 జనవరి నుంచి 2021 జనవరి మధ్య రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసాలు, ఆలయాల్లో చోరీల ఘటనల్లో ముఖ్యమైన 44 కేసుల్ని తీసుకుంటే వాటిలో 15 కేసులను ఇప్పటి వరకూ ఛేదించలేకపోయారు. మిగతా 29 కేసుల్లో కూడా ఎవరో ఒకర్ని నిందితులుగా చూపించి, మమ అనిపించేశారు. సత్వర స్పందన, సరైన దర్యాప్తు చేయకుండా వదిలేయటం, నేరగాళ్ల అరెస్టుకు చొరవ చూపకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు అధికార పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఓ చిన్న పోస్టు పెడితే చాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారెవరో, ఎక్కడున్నారో వెతికి వెతికి పట్టుకునే పోలీసులు దేవాలయాలపై దాడులకు తెగబడుతున్న వారిని మాత్రం పట్టుకోరు. హిందూ దేవాలయాల్లో దుశ్చర్యలకు పాల్పడిన ఆ దుండగులు జగన్ సర్కారు పుణ్యమా అని దర్జాగా గడిపేస్తున్నారు.
కొరవడిన సమీక్షలు:2020-21 మధ్య దేవాలయాలపై వరుస దాడుల జరగ్గా ‘రాష్ట్రంలోని 58 వేల 871 ప్రార్థనా మందిరాలను గుర్తించి మ్యాపింగ్, భద్రత ఆడిట్ పూర్తి చేశామని 13 వేల 296 ప్రదేశాల్లో 44 వేల 521 సీసీ కెమెరాలు అమర్చాం’ అని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అప్పట్లో ప్రకటించారు. నిజంగా ఆయన చెప్పినట్లు భద్రత ఆడిట్ జరిగి, అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెడితే ఇప్పటికీ వరుస ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా? భద్రత లోపాల్ని సరిదిద్దారా లేదా అని ఈ రెండేళ్లలో ఒక్కసారైనా సమీక్షించకపోవటం వల్లే కదా హిందూ దేవాలయాలపై ఇన్ని దుశ్చర్యలు చోటుచేసుకుంటున్నాయి.
అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయంలో గత 30 ఏళ్లలో అసలు చోరీయే జరగలేదు. అలాంటిది తాజాగా ఓ దుండగుడు అర్ధరాత్రి వేళ ఆలయంలోకి చొరబడి హుండీని కొల్లగొట్టాడు. అంత ప్రఖ్యాత ఆలయం వద్ద రాత్రి వేళలో గస్తీ నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఆలయంలో దేవాదాయ శాఖ తరఫున ఇద్దరు రాత్రి కాపలాదారులు ఉంటారు. మరి వారేం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మీడియాపై దాడులు భగ్గుమన్న నిరసనలు - కేంద్రం జోక్యం చేసుకోవాలని నినాదాలు
ప్రతిపక్షాలపై బురద చల్లే ప్రయత్నిం:జగన్ అధికారం చేపట్టాక రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, చోరీల ఘటనలు వందల సంఖ్యలో జరగ్గా పోలీసులు కొన్నింటిలోనే కేసులు నమోదు చేశారు. వాటిలో ముఖ్యమైన కేసుల దర్యాప్తు కోసం డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కొన్ని కేసుల్ని మాత్రమే ఛేదించింది. తాగుబోతులు, మతిస్థిమితం లేని వారే ఈ నేరాలకు పాల్పడ్డారని తేల్చేసింది. గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలను ఇప్పుడే సంభవించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడి చేసింది. అంతే తప్ప వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఈ దాడుల వెనక ఉన్న సూత్రధారుల్ని మాత్రం పట్టుకోలేదు. అసలు నిందితుల్ని పట్టుకోలేక చివరికి పలు కేసుల్లో టీడీపీ, బీజేపీ నాయకుల్ని అరెస్టు చేసి ప్రతిపక్షాలపై బురద చల్లేందుకు యత్నించారు.