Amaravati Drone Summit 2024 : డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతిని తీర్చిదిద్దే ప్రణాళికలతో ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 22, 23 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇన్వెనెంటర్లు, ఇన్వెస్టర్లతో పాటు ఐఐటీల నుంచి ప్రతినిధులు, వివిధ డ్రోన్ టెక్నాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.
రాష్ట్రంలో డ్రోన్ సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 పేరిట పౌర విమానయాన శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సీఐఐ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నాయి. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో డ్రోన్ సమ్మిట్, డ్రోన్ హ్యాకథాన్ నిర్వహించనున్నారు. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ఉన్న ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు, డ్రోన్ తయారీ కంపెనీలు, స్టార్టప్‌లు ఈ సమ్మిట్‌లో భాగస్వామ్యం కానున్నాయి. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో ఏర్పాట్లను డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్‌కుమార్‌తో పాటు ఎన్టీఆర్ జిల్లా అధికారులు పరిశీలించారు.
Drone Summit in Mangalagiri :డ్రోన్ సమ్మిట్‌లో ఆయా అంశాలకు చెందిన ప్యానల్ డిస్కషన్లు, కాన్ఫరెన్స్‌లను నిర్వహించనున్నారు. డ్రోన్ హ్యాకథాన్, సమ్మిట్ కోసం వెయ్యి మందికి పైగా డ్రోన్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వ్యవసాయం, వైద్యం, మ్యాపింగ్, భూసర్వే ప్లాటింగ్, మీడియా, అటవీ అభివృద్ధి లాంటి అవసరాలకు డ్రోన్ల వినియోగం జరుగుతోంది. భవిష్యత్‌లో డ్రోన్ల సాంకేతికతను ఇతర అవసరాలకు విస్తరించేలా సాంకేతికతపై సదస్సులో చర్చించనున్నారు. 9 అంశాల్లో ప్యానల్ డిస్కషన్స్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు డ్రోన్ల వినియోగంలో తీసుకురావాల్సిన నిబంధనలు, నియంత్రణ వంటి అంశాలపైనా రెండు రోజుల సదస్సులో చర్చించనున్నట్టు తెలుస్తోంది.