Mukkoti Ekadashi Arrangements At Dwarka Tirumala: ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఈనెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
9వ తేదీన గిరి ప్రదక్షిణ-10న ఉత్తర ద్వార దర్శనం: సర్వదర్శనం రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు, ఇరుముడులు సమర్పించే గోవింద స్వాములకు, గ్రామస్థులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో సైతం అందుబాటులో ఉంచారు. అదే విధంగా అనివేటి మండపంలో ఉచిత ప్రసాద పంపిణీకి ఏర్పాటు చేస్తున్నారు.
ఆలయ ప్రాంగణాలైన అనివేటి మండపం, ఘాట్ రోడ్ల పక్కనున్న డివైడర్లకు రంగులు వేయించడంతో పాటు ఆలయ రాజగోపురాలకు విద్యుదీకరణ పనులను చేయిస్తున్నారు. అలాగే ముక్కోటి ఏకాదశి ముందు రోజైన 9వ తేదీన సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు స్వామివారి గిరి ప్రదక్షిణ జరగనుంది. అందుకోసం గిరిప్రదక్షిణ మార్గాన్ని సైతం సిద్ధం చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం 5 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వేండ్ర త్రినాథరావు ఈ సందర్భంగా తెలియజేశారు.