APSRTC Clarity On Senior Citizen Concession Tickets : ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వృద్దులకు ఇస్తున్న రాయితీ టికెట్ల విషయమై పాటించాల్సిన నియమాలను సిబ్బందికి మరోసారి APSRTC స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పల రాజు ఈ ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్దులకు బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధరలో 25 శాతం రాయితీ టికెట్లను ఎప్పట్నుంచో ఆర్టీసీ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్దారణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బంది, వృద్దులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.
అవగాహన లేమితో వాగ్వాదాలు : సిబ్బంది కేవలం ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను అంగీకరించడం లేదు. ఒరిజినల్ కార్డులు లేనప్పుడు డిజిటల్ కార్డులు చూపించవచ్చని తెలిపినా సిబ్బంది అవగాహన లేమితో టికెట్ల జారీకి నిరాకరిస్తున్నారు. దీనిపై పలు ప్రాంతాల నుంచి వృద్దులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో రాయితీ టికెట్ల జారీ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేస్తూ సిబ్బందికి తాజాగా మరోసారి ఆదేశాలిచ్చింది. వృద్దులు వయసు నిర్దారణ కోసం 6 రకాలైన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించవచ్చని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఆర్టీసీ తెలిపింది.