ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇకపై అన్ని పోటీ పరీక్షలు ఆ విధానంలోనే - APPSC ప్రత్యేక కమిటీ నివేదిక - APPSC COMMITTEE FINAL REPORT

ఏపీపీఎస్సీలో సంస్కరణలపై ఏర్పడ్డ ప్రత్యేక కమిటీ తుది నివేదికలో వెల్లడి - ఆగస్టు 31 నాటికి ఖాళీలను ప్రభుత్వ శాఖలు ప్రకటించాలి - సెప్టెంబరు 1 నుంచి ప్యానల్‌ ఇయర్‌

APPSC Reforms Committee Final Report-2024
APPSC Reforms Committee Final Report-2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2024, 7:16 AM IST

Updated : Dec 27, 2024, 10:13 AM IST

APPSC Reforms Committee Final Report-2024 : రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 272 రకాల పోస్టులను టెక్నికల్‌ సర్వీసెస్‌, నాన్‌ టెక్నికల్ కేటగిరీలుగా విభజించి, నియామకాలు చేపట్టాలని ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. అలాగే ఈ నియామక పరీక్షలన్నింటినీ ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించాలని సూచించింది. నాన్‌-టెక్నికల్‌ విభాగంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, సర్వీసెస్‌ను చేర్చింది. అలాగే టెక్నికల్‌ సర్వీసెస్‌లో ఏ, బీ, సీ కేటగిరీల కింద ఇంజినీరింగ్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఉంచాలని సూచించింది.

ఏపీ టీచింగ్‌ సర్వీసెస్‌లో ఏ, బీ కేటగిరీల వారీగా, ఏపీ టెక్నికల్‌ సర్వీసెస్‌లో ఇతర పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, కళాశాలల అధ్యాపకులు, ఇంజినీరింగ్, ఇతర పోస్టుల భర్తీ వేర్వేరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాలు, పరీక్షా విధానం, ప్రతిపాదనల్లో ఉన్న పోస్టుల రీ-గ్రూపింగ్, ఇతర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది.

దిల్లీలోని యూపీఎస్సీ, కేరళ, రాజస్థాన్, బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయాలను సందర్శించి అక్కడి కార్యకలాపాల తీరు సమీక్షించింది. వీటిని ఏపీపీఎస్సీ కార్యకలాపాలతో సమన్వయం చేస్తూ తీసుకురావాల్సిన సంస్కరణలపై రూపొందించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వశాఖల్లో పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలని పేర్కొంది. అయితే ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయి.

డిసెంబరులోగా నియామకాలు పూర్తి

ప్రతి ఏడాది ‘ప్యానల్‌ ఇయర్‌’ను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలి. ఆగస్టు 31నాటికి ప్రభుత్వ శాఖల యూనిట్‌ ఆఫీసర్లు ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలి. మంజూరైన పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి అక్కర్లేదు. జూన్‌ నుంచి కసరత్తు ప్రారంభించాలి. దీనికి అనుగుణంగా ఏపీపీఎస్సీ ‘జాబ్‌ క్యాలెండర్‌’ను ఖరారు చేయాలి. మరుసటి సంవత్సరం డిసెంబరులోగా నియామకాలు పూర్తి కావాలి. కమిషన్‌ ఎంపికచేసే అభ్యర్థులకు మార్చిలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రస్తుత నియామకాల తీరు ఆందోళనకరంగా ఉంది. శాఖల నిర్లక్ష్యం వల్ల నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీ ఓ క్రమ పద్ధతి ప్రకారం జరగట్లేదు. కానీ కేరళ, రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, యూపీఎస్సీలో ఓ పద్ధతి ప్రకారం నోటిఫికేషన్ల జారీ, నియామకాలు జరుగుతున్నాయి.

మార్కుల్లో 10% మాత్రమే కేటాయించాలి

బిహార్‌లో మౌఖిక పరీక్షల నిర్వహణ విధానం బాగుంది. ప్రధాన పరీక్షల మొత్తం మార్కుల్లో 10% మాత్రమే మౌఖిక పరీక్షలకు కేటాయించాలి. బోర్డు ఛైర్మన్, ఇతర సభ్యులు అభ్యర్థికి ఇచ్చిన మార్కులను కలిపి ‘స్కోర్‌’ను రికార్డు చేస్తారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులకు సాధారణంగా 50% నుంచి 80% మధ్య మాత్రమే మార్కులు వస్తాయి. అంతకుమించి మార్కులొస్తే అందుకు కారణాలను రికార్డుల్లో నమోదుచేయాలి. మౌఖిక పరీక్షకు 15 నిమిషాల ముందే పాల్గొనేవారికి ఏ బోర్డుకు వెళ్లాలో చెప్పేలా సాఫ్ట్‌వేర్‌ ర్యాండమైజేషన్‌ విధానాన్ని తీసుకురావాలి. అభ్యర్థులను బోర్డులకు పంపడంలోనూ సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ర్యాండమ్‌ విధానాన్ని అవలంబించాలి. మెయిన్, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్‌ జాబితా ప్రకటించాలి. ఈ విధానాల ద్వారా పారదర్శకత పెరుగుతుంది.

మొత్తం మార్కులకు కలపకూడదు

  • బిహార్‌లో మాదిరిగా మౌఖిక పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్నట్లు ప్రిలిమ్స్‌/మెయిన్స్‌లో వచ్చిన మార్కులు, మతం, చిరునామా వివరాలు బయట పెట్టకూడదు. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హత, సాంకేతిక విద్యార్హతలే బోర్డు సభ్యులకు తెలియచేయాలి.
  • గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో వచ్చే మార్కులను మొత్తం మార్కులకు కలపకూడదు.
  • గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లో సూపరింటెండెంట్, తత్సమాన పోస్టులను చేర్చారు. స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ కేటగిరీ-ఏ,బీ లకు ఒకేలా ఉండాలి.
  • జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, రహదారులు-భవనాలు, గిరిజన సంక్షేమం, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలను ఏపీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ గ్రూప్‌లోకి తేవాలి.

ఎరుపు, పసుపు, పచ్చ రంగుల్లో ప్రశ్నపత్రాలు

అన్ని రకాల పరీక్షలనూ ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలి. మూడు రకాల పరీక్షా ప్రశ్నపత్రాలను ఎరుపు, పసుపు, పచ్చ రంగుల్లో ముద్రించాలి. ఆన్సర్‌ బుక్‌లెట్‌లోనే ప్రశ్నలూ అనుసంధానంగా ఉండాలి. బిహార్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. సంస్కరణల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కన్వీనర్‌గా సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ ఉన్నారు. మరో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారు.

నిరుద్యోగులకు శుభవార్త - పెండింగ్ నోటిఫికేషన్స్​ కోసం ఏపీపీఎస్సీ చర్యలు

ఏపీపీఎస్సీ నూతన ఛైర్‌పర్సన్‌గా అనురాధ - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

Last Updated : Dec 27, 2024, 10:13 AM IST

ABOUT THE AUTHOR

...view details