ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాబ్‌ క్యాలెండర్‌ మేరకే కొలువుల భర్తీ- త్వరలోనే ప్రభుత్వానికి కమిటీ నివేదిక - APPSC Experts Committee Proposals - APPSC EXPERTS COMMITTEE PROPOSALS

APPSC Experts Committee Proposals : ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో తీసుకోవాల్సిన మార్పులపై అధ్యయనం చేసిన కమిటీ నివేదిక సిద్ధం చేసింది. నిపుణుల కమిటీ పలు కీలక ప్రతిపాదనలను రూపొందించింది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేయాలని సిఫార్సు చేయనుంది. మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదని, ఏపీపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల ఎంపికకు సెర్చ్‌ కమిటీ ఏర్పాటు, 6 గ్రూపులుగా ఉద్యోగాల విభజన తదితర కీలక అంశాలను సిఫార్సు చేయనుంది.

APPSC Experts Committee Proposals
APPSC Experts Committee Proposals (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 9:46 AM IST

Experts Committee on Job Calendar :ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గతేడాది జులై 31న వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులతో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. పంచాయతీరాజ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఛైర్మన్‌గా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక, న్యాయశాఖ, ఏపీపీఎస్సీ కార్యదర్శులు జానకి, సునీత, ప్రదీప్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు.

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే ఉద్యోగాల భర్తీ :వీరు యూపీఎస్సీతో పాటు రాజస్థాన్, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల కార్యకలాపాలను పరిశీలించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్‌ క్యాలెండర్‌ విధానంలో చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. సర్కార్ అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని, వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనుంది.

ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు :ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌-ఎ, సివిల్‌ సర్వీసెస్‌-బి, స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్, ఇంజినీరింగ్‌ సర్వీసెస్, టీచింగ్‌ సర్వీసెస్, స్టేట్‌ జనరల్‌ సర్వీసెస్‌ కింద వర్గీకరించాలని కమిటీ ప్రతిపాదించింది. ఉమ్మడి రాష్ట్రంలో 1995 డిసెంబర్‌ 14న ఇచ్చిన జీవో-275లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలన్న నిబంధనను తొలగించాలని ప్రభుత్వానికి విన్నవించనుంది.

Job Calendar in AP : ఉద్యోగాల భర్తీ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం జరపాలని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారుచేసి వెబ్‌పోర్టల్‌ ద్వారా ఏపీపీఎస్సీకి అందించాలని నిర్ణయించింది. డైరెక్ట్, క్యారీఫార్వర్డ్, ఆన్​ఫిల్డ్‌ విధానంలో ఖాళీలు, ఇతర వివరాలను సంబంధిత శాఖలు నిర్దేశిత నమూనాలో పంపించాలని సూచించింది. జాబ్‌ క్యాలెండర్‌ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయమై కమిటీ ఇంకా స్పష్టతకు రాలేదు.

నోటిఫికేషన్ల జారీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ :ప్రతి ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాలను ఏటా మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 30లోగా సంబంధిత కార్యదర్శులకు పంపాలి. కార్యదర్శులు మే 1 నుంచి జులై 31లోగా ఆమోదం తెలపాలి. ఆన్‌లైన్‌ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15లోగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రాథమికంగా చర్చించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పర్యవేక్షణలో థర్డ్‌ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించింది.

ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్‌లో మాదిరిగా అక్కడికక్కడే మార్కులు స్క్రీన్‌పై తెలిసే విధానాన్ని అనుసరించనుంది. కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో జాబ్‌ క్యాలెండర్‌ విధానం అమల్లో లేదు. పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేస్తున్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో నిమిత్తం లేకుండానే ఆ ఖాళీల వివరాలు కమిషన్‌కు వెళ్తున్నాయి. కమిషన్‌ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని ఏర్పాటుచేసి అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాలోని అధికారితో పర్యవేక్షించాలని ఈ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిని నియమించొద్దని కమిటీ ప్రతిపాదించింది.

సెర్చ్ కమిటీలు వేయాలి : ఉద్యోగార్థులు చెల్లించే ఫీజులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమవుతున్నాయి. వీటిని ఏపీపీఎస్సీ కార్యాలయానికి జమయ్యేలా నిబంధన మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. యూపీఎస్సీలో మాదిరిగా కమిషన్‌లో నియమించే సభ్యులకూ ఉత్తమ విద్యార్హతలు ఉండాలని ఛైర్మన్, ఇతర సభ్యులు వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని కమిటీ భావించింది. ఛైర్మన్, సభ్యుల నియామకాలకు సెర్చ్ కమిటీలు వేయాలని దీనిలో యూపీఎస్సీకి చెందిన వారిని కూడా సభ్యులుగా చేర్చాలని నిర్ణయించింది. వ్యాసరూప ప్రశ్నలను ఒక్కో నిపుణుడి నుంచి ఒకటి లేదా రెండు మాత్రమే తయారు చేయించాలని, ఏపీపీఎస్సీ పరిధి నుంచి ఉద్యోగుల క్రమశిక్షణ కేసుల పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలని కమిటీ తన నివేదికలో ప్రతిపాదించింది.

ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల - అర్ధరాత్రి రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ - AP Group1 Prelims Results Released

ఏపీపీఎస్సీ కాదు జేపీపీఎస్సీ- గ్రూప్​ 1 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

ABOUT THE AUTHOR

...view details