APCC Chief YS Sharmila on YSRCP: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్‌రెడ్డి (Former Director of AP Mines Department Venkata Reddy) లాంటి తీగలే కాదని, పెద్ద డొంకలు కూడా కదలాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్‌లో ఉన్నా విచారణ జరపాలని ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
2 వేల 566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే, తెర వెనక ఉండి, సర్వం తానై వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో సహజ సంపదను దోచుకుతిన్నారని ఆరోపించారు. అస్మదీయులకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని, టెండర్లు, ఒప్పందాలు, నిబంధనలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి దోచి పెట్టారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్జీటీ (National Green Tribunal) నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖాతాలకు తరలించారన్నారు.
గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ (Anti Corruption Bureau) విచారణతో పాటు, పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సహజ వనరుల దోపిడీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో పాటు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్, ఐఎన్‌సీ ఇండియా, ఐఎన్‌సీ ఆంధ్రప్రదేశ్ ఖాతాలను కూడా ట్యాగ్ చేశారు.