AP Unemployed Youth Protest for Mega DSC Notification : ఐదేళ్లుగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ఊరిస్తున్న ప్రభుత్వం చివరకు ఆరు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనికి నిరసనగా 'దగా డీఎస్సీ వద్దు - మెగా డీఎస్సీ' కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. నెల రోజుల్లో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాజాగా విజయనగరంలో D.Y.F.I ఆధ్వర్యంలో నిరుద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. మెగా డీఎస్సీ (DSC) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.
దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ప్లీజ్- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలు
కలెక్టరేట్ వద్ద బైఠాయించి మినీ DSC వద్దు మెగా డీఎస్సీ కావాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు 23,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేశారని ఆరోపించారు. ఏటా జాబ్ క్యాలెండర్, డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు కేవలం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
DSC Candidates Protest in Andhra Pradesh :జగన్ అధికారంలోకి రాగానే మెగా DSC ప్రకటిస్తానని దగా డీఎస్సీ విడుదల చేశారని నిరుద్యోగులు మండిపడ్డారు. మెగా డీఎస్సీ ఇవ్వాలంటూ కాకినాడ ధర్నాచౌక్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. 'మెగా డీఎస్సీ ముద్దు - జగన్ వద్దు' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోస్టులు పెంచకపోతే జగన్ను గద్దె దించటానికి సిద్ధమని హెచ్చరించారు.