AP Tenth Class Exams in Telugu: పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలలో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో మీడియంని ఎంపిక చేసుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు కావాలంటే ఆప్షన్ను మార్చుకోవచ్చని సూచించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల వారిని ఒకేసారి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020-21లో ఆదేశాలిచ్చింది. అయితే ఇంగ్లిష్ మీడియం అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున ‘ఇంగ్లిష్ మీడియం’ అని వాడకుండా ‘ఒకే మీడియం’ ఉండాలని ఆదేశించారు.
అంటే అనధికారికంగా ఇంగ్లిష్ మీడియమే అన్నట్లు వ్యవహరించారు. ఒక్కో తరగతి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ, పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన పెట్టారు. ఒకే మీడియం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మీడియం అనేది చెప్పకపోవడంతో చాలా పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలను కొనసాగించారు. ఇలా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది.