ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలుగువారందరికీ గర్వకారణం'- పీవీ నరసింహారావుకు భారతరత్నపై ప్రముఖుల స్పందన

Bharat Ratna to PV Narasimha Rao: భారత మాజీ ప్రధాని తెలుగుతేజం పీవీ నరసింహారావుకు భారతరత్న దక్కడంపై ఏపీకి చెందిన పలువురు నేతలు స్పందించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పీవీకి భారతరత్న ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఆదర్శనీయుడని కొనియాడారు.

Bharat Ratna to PV Narasimha Rao
Bharat Ratna to PV Narasimha Rao

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 3:48 PM IST

Updated : Feb 9, 2024, 5:37 PM IST

Bharat Ratna to PV Narasimha Rao:భారత మాజీ ప్రధాని, తెలుగుతేజం పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పీవీ నాయకత్వ పటిమను ప్రదర్శించారని చంద్రబాబు కొనియాడారు. పీవీ తన ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించినందుకు ఈ ఘనత దక్కిందని నారా లోకేశ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

భారతరత్న దక్కడం హర్షణీయం:భారతరత్న ద్వారా ముగ్గురు భరతమాత ముద్దుబిడ్డలకు సముచిత గౌరవం దక్కిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పీవీ, చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌కు భారతరత్న దక్కడం హర్షణీయం తెలిపారు. ఆర్థిక సంస్కరణలతో పీవీ దేశానికి దశదిశ చూపారని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన దార్శనికుడని వెంకయ్య కొనియాడారు. పీవీ తెచ్చిన సంస్కరణలతో దేశ ఆర్థిక పరిస్థితిని గాడిందని తెలిపారు.

భారతరత్నకు విధాలా అర్హులు: పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించటం తెలుగువారందరికీ గర్వకారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతోషం వ్యక్తంచేశారు. పండితుడిగా, నాయకుడుగా, ఆర్థికవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడుగా, బహుభాషావేత్తగా, మానవతావాదిగా భారతరత్న బిరుదుకు పీవీ నరసింహారావు అన్ని విధాలా అర్హులని చంద్రబాబు కొనియాడారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పీవీ కనబరిచిన నాయకత్వ పటిమ, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై గొప్పగా నిలబెట్టాయని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రం, దేశం పట్ల ఆయన చూపిన దార్శనికత ఎందరికో స్పూర్తిదాయకమని చంద్రబాబు తెలిపారు.
'మన్మోహన్‌జీ వీల్​చైర్​లో కూడా పనిచేశారు'- మాజీ ప్రధానిపై మోదీ ప్రశంసలు

విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. పీవీకి భారతరత్న ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అర్ధిక సంస్కరణల ద్వారా, విప్లవాత్మక మార్పులకు పీవీ శ్రీకారం చుట్టారని ఆమె పేర్కొన్నారు. పీవీ నరసింహారావుతో పాటుగా, చరణ్ సింగ్, ఎమ్ఎస్ స్వామినాథన్​లకు భారతరత్న ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

తెలుగువారందరికీ దక్కిన నిజమైన గౌరవం: పీవీ నరసింహారావుకు భారతరత్న లభించటం తెలుగువారందరికీ దక్కిన నిజమైన గౌరవమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. తన ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించినందుకు ఈ ఘనత దక్కిందన్నారు. భారతదేశాన్ని శక్తివంతగా తీర్చిదిద్దటంలో ఆయన కృషి అపారమని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చిన గొప్ప నాయకుడికి ఆయన నివాళులు ఆర్పించారు.
దేశం ఆకలి తీర్చిన శాస్త్రవేత్త- హరిత విప్లవ పితామహుడికి భారత రత్న

పీవీ నరసింహారావు వివరాలు: భారత మాజీ ప్రధాని, తెలుగుతేజం పీవీ నరసింహారావు వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్‌ 28న జన్మించారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగానూ పీవీ నరసింహారావు సేవలందించారు. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధానిగా ఖ్యాతి గడించారు. బహుభాషా కోవిదుడిగానూ ఆయనకు గుర్తింపు ఉంది. 1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. 5 లక్షల ఓట్ల మెజార్టీతో నంద్యాల ఎంపీగా గెలుపొందారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న- మరో ఇద్దరికి కూడా

Last Updated : Feb 9, 2024, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details