AP JAC Chairman Bopparaju Venkateswarlu :గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో 10, 15 తేదీల్లో జీతాలు అందేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైనా మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. విజయవాడ రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి సెక్రటేరియట్ సమావేశం అనంతరం మీడియాతో ఆ సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదర్ మాట్లాడారు. ఉద్యోగులు అభిప్రాయాలతో కూడిన 18 అంశాలను సీఎం కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు.
ఉద్యోగులు కోరుకున్నట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందని, ఉద్యోగులు కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. పండుగలు వెళ్లిపోతున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు లేవని చెప్పారు. గతంలో 10, 15 తేదీల వరకు జీతాలు అందేవని, ఇప్పుడా పరిస్థితి తప్పిందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మధ్యంతర భృతిని ప్రకటించకుండా గత ప్రభుత్వం వెళ్ళిపోయిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రకటించాలని కోరారు. పీఆర్సీ కాల పరిమితి దాటి 15 నెలలు అయిందని, వెంటనే కమిషనర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.