AP HC on Helmet Issue :హెల్మెట్ ధరించక 3 నెలల్లో 667 మరణాలు సంభవించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా తప్పుపట్టింది. చట్టనిబంధనలను సక్రమంగా అమలు చేస్తే ఈ పరిస్థితులు రావని తెలిపింది. 667 మంది అంటే తక్కువ సంఖ్య కాదని ధర్మాసనం పేర్కొంది. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఇకపై ఎక్కువ మందిని మృత్యువాత పడనీయబోమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
చట్ట నిబంధనలపై అవగాహనను, వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనే భయాన్ని ప్రజల్లో కల్పించాలని హైకోర్టు పేర్కొంది. చలానాలు వేసి చేతులు దులుపుకొంటే సరిపోదని కట్టని వారికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసే విషయాన్ని పరిశీలించాలని సూచనలు చేసింది. అధిక మొత్తంలో జరిమానాలు విధించడం సమస్యకు పరిష్కారం కాదంది. ద్విచక్రవాహనాలు నడిపే సామాన్యులు రూ.1000 చొప్పున జరిమానాలు చెల్లించలేరని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏపీలో 8770 మంది ట్రాఫిక్ పోలీసులకు గాను 1994 మంది మాత్రమే ఉన్నారని, ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
పోలీసు తనిఖీలేవి? : హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేవారు విజయవాడ నగరంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నారని హైకోర్టు పేర్కొంది. అలాంటి వారికి పోలీసులు చలానాలు విధిస్తున్న ఘటనలు తమకు ఒక్కటి కూడా కనిపించలేదని తెలిపింది. కార్లు నడిపేవారు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్లేటప్పుడు తెలంగాణ సరిహద్దు రాగానే సీటు బెల్ట్ పెట్టుకుంటున్నారని గుర్తుచేసింది. అక్కడి పోలీసులంటే భయం వల్ల ఈ పనిచేస్తున్నారని, ఏపీ పోలీసుల విషయంలో ఆ భయం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కార్ల అద్దాలకు నల్లరంగు ఫిల్మ్ వేసినవే ఎక్కువ కనిపిస్తున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో రవాణాశాఖ కమిషనర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఆ రోజు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. హెల్మెట్ ధరించని వారికి ఎన్ని చలానాలు వేశారు? చలానా కట్టకపోతే ఏం చేస్తున్నారు? అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహించారు, తదితర వివరాలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలిచ్చింది.