ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాల వివరాలివ్వండి' - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - AP HIGH COURT ORDERS TO GOVT

పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు - ఐటీ విభాగాధికారికి నివేదికలివ్వాలని డీఎస్పీలకు స్పష్టీకరణ

AP_High_Court_Orders_to_Govt
AP_High_Court_Orders_to_Govt (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2025, 6:57 AM IST

HC Orders to Govt on Police Stations CCTV Cameras:పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,392 పోలీసు స్టేషన్లు ఉంటే 1001 ఠాణాల్లో మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. 81 జైళ్లలో 1,226 కెమెరాలు ఏర్పాటు చేయగా 788 మాత్రమే పని చేస్తున్నాయని గుర్తు చేసింది. వాటి మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంది. మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో పోలీసు స్టేషన్‌ ప్రాంగణం మొత్తం కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని అందరు డీఎస్పీలకు ధర్మాసనం సూచించింది.

ఈ వ్యవహారమై రాష్ట్రంలోని ఐటీ విభాగానికి చెందిన ఉన్నతాధికారికి నివేదికలు సమర్పించాలని డీఎస్పీలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నివేదికలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. పోలీసు స్టేషన్లు, కారాగారాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వీడియో స్టోరేజ్‌ సామర్థ్యం ఎంత? ఫుటేజ్‌ను ఎక్కడ భద్రపరుస్తున్నారు? తదితర వివరాలతో అఫిడవిట్‌ వేయాలంది. సీసీ కెమెరాలు పాడైనప్పుడు ఎవరికి రిపోర్టు చేయాలి, వాటి మరమ్మతుల కోసం అనుసరిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌. రఘునందన్‌రావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

వల్లభనేని వంశీ కేసులో ఆధారాలపై దృష్టి - కిడ్నాప్‌ సీసీ ఫుటేజ్‌ లభ్యం

2022లో కోర్టుధిక్కరణ కేసు దాఖలు: సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని ఠాణాలు, కారాగారాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా రాష్ట్రంలో ఆ ప్రక్రియ పూర్తిగా అమలు కాలేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలంటూ 2019 జులై 15న ఆదేశించింది. ఈ ఆదేశాలకు అధికారులు కట్టుబడి లేదని పేర్కొంటూ యోగేష్‌ 2022లో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపించారు.

లాకప్‌ ఉన్న పోలీసు స్టేషన్లలో కెమెరాలు ఏర్పాటు చేశామని హైకోర్టుకు వివరించారు. పాడైన వాటిని బాగు చేసే బాధ్యతను రెండు ఏజెన్సీలకు అప్పగించామని అన్నారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది యోగేష్‌ వాదనలు వినిపిస్తూ ఇప్పటికి 391 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని అన్నారు. వీడియో స్టోరేజ్‌ సామర్థ్యం ఎంత, ఎక్కడ భద్రపరుస్తున్నారు, తదితర వివరాలను ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొనలేదని తెలిపారు. మరోవైపు కటారు గోపిరాజును అనే వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారంటూ పల్నాడు జిల్లా మాచవరం పోలీసులపై దాఖలైన పిటిషన్​ని సైతం పైన పేర్కొన్న కోర్టు ధిక్కరణ కేసుతో కలిసి విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్‌ కాలిపోయిందంటూ మాచవరం పోలీసులు గతంలో హైకోర్టుకు నివేదించింది.

58 ఏళ్ల చరిత్రని తిరగరాసిన జగన్ - అప్పుల కుప్పకు వడ్డీ ఎంతో తెలుసా?

కళ్లు తిరిగి కాలువలో పడిపోయిన వ్యాపారి - మూడు రోజులుగా చెత్తలోనే

ABOUT THE AUTHOR

...view details