AP High Court On Government Scheme Funds Distribution Issue :ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈనెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపింది. ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రానందున రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఈనెల 10న నిధుల పంపిణీ చేయలేదని తెలిపింది. మరోవైపు ఈనెల 11 నుంచి 13లోపు సొమ్ము జమచేయడానికి వీల్లేదని సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని గుర్తు చేసింది. మే 11 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పిరియడ్ ప్రారంభమవుతుందని పేర్కొంది. మరోవైపు ఓటింగ్ 13న జరిగిన మరుసటి రోజు (14న) లబ్ధిదారులకు సొమ్ము జమచేయవచ్చని ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్‌దేశాయ్ తెలిపారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అప్పీళ్లపై విచారణ జరిపి ఉత్తర్వులివ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ 'నవతరం పార్టీ' జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ధర్మాసనం ముందు అత్యవసరంగా వేర్వేరు అప్పీళ్లు వేశారు. విచారణ సందర్భంగా ఈసీ తీరుపై ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. నిధుల జమ విషయంలో ఈసీ ఉత్తర్వులను సింగిల్ జడ్జి తాత్కాలికంగా పక్కనపెట్టినప్పుడు (అబయన్స్) ప్రభుత్వాన్ని మరికొంత స్పష్టత కోరడాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలుకు వీలుగా రాష్ట్రప్రభుత్వానికి ఎన్‌ఓసీ ఎందుకు ఇవ్వలేదని ఈసీని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను అమలు చేయనప్పుడు అప్పీల్ ఎందుకు వేయలేదని వ్యాఖ్యానించింది. ఓ వైపు సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయకుండా మరోవైపు అభ్యంతరం ఉంటే ఆ ఉత్తర్వులపై అప్పీల్ వేయకుండా ఉంటే ఏవిధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించింది. హైకోర్టు కంటే ఈసీ ఎక్కువ కాదంది.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాల విషయంలో ఈసీ భిన్న వైఖరి అనుసరించడం సరికాదంది. ఓటింగ్ తేదీ ముగిశాకైనా ప్రభుత్వాన్ని వివరణ కోరకుండా నిధుల పంపిణీకి అనుమతిస్తారా? లేదా? అని సూటిగా ప్రశ్నించింది. పోలింగ్ తేదీకి ముందు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయవద్దని, ఓటింగ్ ముగిసిన మరుసటి రోజు(14న) చేపట్ట వచ్చిన పేర్కొంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి పోలింగ్ తేదీ ముగిశాకే నిధులను జమచేయాలని ఈనెల 9న ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను 10వ తేదీ వరకు తాత్కాలికంగా పక్కనపెట్టారు. 11 నుంచి 13 వరకు నిధులను జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.