AP High Court Cancels GO 56 :ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్య కోర్సులకు ఫీజులను ఖరారు చేస్తూ గత ప్రభుత్వం తెచ్చిన జీవో 56ను హైకోర్టు రద్దు చేసింది. రెండు నెలలో ఫీజులను నిర్ణయించాలని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఆదేశించింది. కళాశాలలు కోరినట్లుగా ఫీజులను నిర్ణయించేందుకు కమిషన్ అంగీకరించకపోతే తుది ఉత్తర్వులు జారీ చేసే ముందు యాజమాన్యాల అభిప్రాయం సేకరించాలని కమిషన్‌కు స్పష్టం చేసింది. ఒకవేళ ఫీజును పెంచితే ఆ సొమ్మును పీజీ వైద్య విద్యార్థుల నుంచి రాబట్టుకునేందుకు కళాశాలలకు వెసులుబాటు ఇచ్చింది. కోర్సు పూర్తి చేసినప్పటికీఆ పెరిగిన ఫీజును విద్యార్థులు చెల్లించాలని పేర్కొంది.
AP High Court Judgment on GO 56 :2020-21 నుంచి 2022-23కి ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల ఫీజుల్ని ఖరారు చేస్తూ గత ప్రభుత్వం 2020 మే 29న జీవో 56 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ పలు ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. క్లినికల్ డిగ్రీ కన్వీనర్ కోటా సీటుకు 4.32లక్షలు, మేనేజ్‌మెంట్ కోటా సీటుకు 8.64లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు 50లక్షలు నిర్ణయించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అన్ని కళాశాలలకు ఒకే తరహా ఫీజుల ఖరారు తగదన్నారు. ఖర్చులు, మౌలిక వసతులు వంటి విషయాల్లో కళాశాలలు సమర్పించిన వివరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా APHERMC ఫీజుల్ని నిర్ణయించిందన్నారు. 2017-18 నుంచి 2019-20 సంవత్సరానికి కన్వీనర్ కోటా క్లినికల్ డిగ్రీ సీటు ఫీజు 6.90లక్షలుగా ఉండేదని, 2020-21 నుంచి 2022-23కి కన్వీనర్ కోటా సీటు ఫీజు 4.32లక్షలుగా నిర్ణయించరని ఆ జీవోను రద్దు చేయాలని కోరారు.