AP Govt Sensational Decision on Temples : దేవాలయాల్లో పూజాదికాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారైనా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అర్చకులకు విస్తృత అధికారాలు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.
Autonomy To Priests in AP Temples : పూజలు, సేవలు, యాగాలు, కుంభాభిషేకాల వంటి వాటిల్లో అధికారుల పాత్రని పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయా దేవాలయాల ఆగమం ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేలా అర్చకులకు వెసులుబాటు కల్పించింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో పూజారులదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చని వెల్లడించింది. ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని చెప్పింది. ఆయా ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారమే వైదిక విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు సర్కార్ జీఓను విడుదల చేసింది.
మరోవైపు ఇటీవలే ప్రభుత్వం ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం ప్రతి నెలా అందించే సాయాన్ని రూ.5,000ల నుంచి రూ. 10,000కు పెంచిన విషయం తెలిసిందే. నిధుల పెంచడంతో ఆలయాల్లో నిత్యం విశేష పూజలు జరగబోతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో 5400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. పెంచిన రూ.10,000లలో రూ.7000లు అర్చకుడి భృతిగానూ, రూ.3,000లు పూజలకు వినియోగించాలని వెల్లడించింది.