Papikondalu Tour Start in AP : చుట్టూ ఎత్తైన కొండలు కనుచూపు మేర పచ్చదనం.. గోదావరిలో విహారం ఈ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇలాంటి సుందరమైన దృశ్యాలు పాపికొండల విహారయాత్రలో కనిపిస్తాయి. ఈ టూర్ ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. దీంతో చాలా మంది సందర్శకులు మళ్లీ పాపికొండల్లో విహారయాత్ర ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల టూర్‌ను తిరిగి ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలు పరిశీలించాకే యాత్రకు అధికారులు అనుమతిచ్చారు.
ఈ క్రమంలోనే శనివారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గోదావరి నది నుంచి పాపికొండలకు విహారయాత్ర ప్రారంభమైంది. పర్యాటకుల క్షేమం కోసం సబ్ కలెక్టర్ కల్పన శ్రీ ముందస్తు చర్యలు చేపట్టారు. విహారయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, ఫారెస్ట్ పోలీస్ బృందాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని ప్రమాదం జరిగితే ఏ విధంగా రక్షించి ప్రాథమిక చికిత్స ఎలా అందిచాలో తెలియజేశారు. సీపీఆర్ చేయడంపై శిక్షణ ఇచ్చారు. పర్యాటకులు లైఫ్ జాకెట్లు వేసుకోవడం తప్పనిసరి అని సబ్ కలెక్టర్ కల్పన శ్రీ స్పష్టం చేశారు.