SEB Cancellation in AP : రాష్ట్రంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్)ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి సీహెచ్. ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు ఇచ్చారు. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత సర్కార్ ఇచ్చిన 12 జీవోలనూ వెనక్కి తీసుకుంటున్నామని అందులో పేర్కొంది. ఎక్సైజ్ శాఖ పునర్వవస్థీకరణలో భాగంగా దీనిని రద్దు చేశామని వెల్లడించింది.
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సెబ్ ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, విధుల నిర్వహణా మార్గదర్శకాలు, అధికారాల బదలాయింపు, సెబ్ కమిషనర్ అధికారాలు తదితర జీవోలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందులోని సిబ్బందిని తక్షణమే రిలీవ్ చేస్తున్నట్లు పేర్కొంది. వారంతా ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు వారి మాతృశాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా సర్కార్ వెల్లడించింది.
పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సెబ్ రద్దు :సెబ్‌కు చెందిన సెబ్ స్టేషన్లు, ఫర్నిచర్, వాహనాలు, కంప్యూటర్లు, అద్దె భవనాలను ఎక్సైజ్ శాఖకే అప్పగించాలని ఆదేశాలిచ్చింది. వివిధ కేసుల్లో జప్తు చేసిన వాహనాలు, ఉపకరణాలు, పరికరాలు, సామగ్రి అంతా దానికే బదలాయించాల్సిందిగా పేర్కొంది. 2024 ఆగస్టు 28న రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు సెబ్‌ను రద్దు చేసి ఆబ్కారీ శాఖలో విలీనం చేస్తున్నట్లు తెలిపింది. ఎక్సైజ్ శాఖ కాకుండా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు అనుసంధానమైన పోలీసు, భూగర్భ గనుల శాఖ అధికారులు వారి వారి మాతృశాఖలకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించింది.
ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం : మరోవైపు సెబ్ ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ శాఖలో ఉన్న 6,274 మందిలో 1,881 (30 శాతం) మందిని మాత్రమే ఎక్సైజ్‌లో ఉంచారు. మిగతా వారందరినీ సెబ్‌కు కేటాయించారు. ఇప్పుడు వారిని మళ్లీ ఎక్సైజ్‌లోకి తీసుకురానున్నారు. వీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేయనున్నారు. ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటు కానుంది.
మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ- ఈ నెలాఖరుతో ముగియనున్న పాత విధానం - Cabinet Meeting on Liquor Policy