Health Insurance is Free in Andhra Pradesh: రాష్ట్ర ప్రజలందరికీ త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ విధానం అమల్లోకి వస్తే చికిత్స కోసం 6 గంటల్లోనే అనుమతి పొందవచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిపై త్వరలో ఉన్నతస్థాయిలో జరిగే సమీక్ష సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
షరతులతో నిమిత్తం లేకుండా:దీనికి అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్‌గా గుర్తించి టెండరు పిలువబోతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద ఏడాదికి 25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా ప్రస్తుతం అందిస్తున్నారు. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండరు డాక్యుమెంట్ సిద్ధమైంది.
ఏప్రిల్ లేదా మే నుంచి: ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న 25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి. అయితే ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండరు పిలుస్తారు. ఆపైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు భరిస్తుంది. ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల్లోపు వ్యయమయ్యే చికిత్సలు పొందేవారి సంఖ్య రాష్ట్రంలో 97 శాతం ఉంది. సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్ణయం జరిగిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పనపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఆ మేరకు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు.
5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఉచిత వైద్యం:ప్రస్తుతం వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉన్న వారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో కోటీ 43 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు. బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ సుమారు 7వేల వరకు చెల్లిస్తున్నారు. జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి, మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
నిర్దేశించిన రెండు యూనిట్లకు కలిపి ఒక టెండరు పిలుస్తారు. తక్కువ మొత్తాన్ని కోట్‌చేసి, ఎల్1గా ప్రైవేట్ కంపెనీ వస్తే.. అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్ బాధ్యత అప్పగిస్తారు. ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థే ఎల్1గా వస్తే రెండు యూనిట్ల బాధ్యతను అప్పగిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా సేవలు కొనసాగించేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.