Autonomy for AP Temples : ప్రతి దేవాలయంలో స్వామి, అమ్మవార్లకు ఏయే పూజలు, కైంకర్యాలు ఎప్పుడెప్పుడు ఎలా చేయాలనేది వాటి ఆగమ శాస్త్ర ప్రకారం ఉంటుంది. కానీ కొన్ని ఆలయాల్లో వీటిని సక్రమంగా అమలు కానివ్వకుండా దేవాదాయ అధికారులు జోక్యం చేసుకొని పెత్తనం చేస్తుంటారు. ఇది సరికాదని అర్చకులు, ధార్మిక సిబ్బంది అడ్డుచెప్పే ప్రయత్నం చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోరు. ఇకపై ఇటువంటి వాటికి అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది.
ఆలయాల వైదిక, ఆగమ అంశాల్లో అధికారుల జోక్యం లేకుండా, దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వు 223 జారీచేసింది. ఆగమ సంప్రదాయాల విషయంలో జోక్యం చేసుకోకుండా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో ఏపీలోని ప్రధాన దేవాలయాలైన విజయవాడ కనకదుర్గమ్మ, పెనుగంచిప్రోలు, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలతో పాటు 229 ముఖ్య ఆలయాలు (6-ఎ ఆలయాలు)లో పూజలు, ఉత్సవాలు, యజ్ఞాల వంటివన్నీ ఆయా సంప్రదాయం ప్రకారం జరిగేందుకు అవకాశం ఏర్పడింది. ఈ ఉత్తర్వు వల్ల అర్చకులకు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్లేనని అర్చక, బ్రాహ్మణ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాలపై హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
చట్టంలో ఉన్నప్పటికీ అమలు లేదు :ఏపీలోని ఆయా దేవాలయాల్లో ఆదిశైవ, వీరశైవ, వైఖానస, పాంచరాత్ర, స్మార్త, తంత్రసార, చాత్తాద శ్రీవైష్ణవ, శాఖతీయం (గ్రామ దేవతలు) ఆగమ శాస్త్రాలు పాటిస్తారు. వాటి ప్రకారం నిత్య పూజలు, ఉత్సవాలు, సేవలు, కుంభాభిషేకాలు, యజ్ఞాలు, అధ్యయన ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు వంటివి నిర్వహిస్తారు. వాస్తవానికి ఆగమ శాస్త్ర నిర్వహణ, సంప్రదాయలు అక్కడి అర్చకుల నిర్ణయం మేరకే అమలు చేయాలని దేవాదాయ చట్టం చెబుతుంది. ఈ మేరకు 30/1987 సెక్షన్ 13(1)లో స్పష్టంగా ఉంది. అయితే అదే చట్టంలో ఆలయ కార్యనిర్వహణ అధికారులకు (ఈవోలు) ఎక్కువ అధికారాలు కల్పించడంతో వారిదే పైచేయిగా మారింది. దీంతో అర్చకులు, పండితులు వారు చెప్పినట్లే వినాల్సి వస్తోంది. ఏవైనా ప్రతిపాదనలు ఆగమ శాస్త్రానికి విరుద్ధమని చెప్పినా అధికారులు వినిపించుకోని పరిస్థితి.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వుతో దేవాదాయ కమిషనర్ సహా, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్‌జేసీ), ఉప కమిషనర్, సహాయ కమిషనర్ వంటి అధికారులెవరూ ఆగమ సంప్రదాయాల విషయంలో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అన్ని విషయాల్లోనూ సీనియర్ అర్చకులే నిర్ణయం తీసుకునే వీలును కల్పించింది. ఒకవేళ అవసరమైతే ప్రధాన, ముఖ్య ఆలయాల్లో సీనియర్ ధార్మిక సిబ్బందితో వైదిక కమిటీని ఈవోలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే పీఠాధిపతుల అభిప్రాయాలు తీసుకునేలా సర్కార్ వీలు కల్పించింది.
ఆలయాల సంప్రదాయాలు కాపాడటానికే : ఆలయాల సంప్రదాయాలు కాపాడటం ఎంతో ముఖ్యమని దేవాదాయ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. ఆగమ అంశాలు, వైదికపరమైన వాటిలో ఈవో, ఇతర అధికారులు తలదూర్చకూడదని చెప్పారు. పూజలు, ఉత్సవాలు, యాగాలు తదితరాలన్నీ అర్చకులు, పండితుల నిర్ణయం మేరకే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.