Pawan Kalyan About Gifts :రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గురువారం పార్టీ ఎంపీలతో పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు బాలశౌరీ, ఉదయ్ శ్రీనివాస్‌లు పవన్‌కు కూరగాయలను అందించారు. తనను కలిసే నాయకులు పుష్పగుచ్చాలు, శాలువాలు, బహుమతులు తీసుకు రాకుండా పేదలకు ఉపయోగపడేలా కూరగాయలు, ఇతర వస్తువులను తీసుకరావాలని కోరారు.
ఆ కూరగాయలను త్వరలో ప్రభుత్వం ప్రారంభించే అన్న క్యాంటీన్లకు పంపిస్తామని తనను కలిసిన ఎంపీలకు చెప్పారు. కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనబడేవి కాదని పది మందికి కడుపు నింపేవి తీసుకువస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనకు కూరగాయలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు.
Pawan Kalyan Guidelines to MPs :ఈనెల 22న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించాలని ఎంపీ బాలశౌరి,ఉదయ్ శ్రీనివాస్‌లకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. మానవనరుల అభివృద్ధి, టూరిజం వంటి ముఖ్యాంశాలను పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే, ఎక్కువ ఉద్యోగ అవకాశాలున్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, సేవా రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలపై బాగా దృష్టి సారిస్తే మెరికల్లాంటి యువ శాస్త్రవేత్తలు బయటకి వస్తారని, కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు.