AP Police Arrest Cyber Fraudster :సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌నంటూ పలువురిని మోసగించిన ఓ సైబర్ నేరగాడిని సీఐడీలోని సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా రాచువారిపల్లెకు చెందిన కొండూరి రాజేష్ (34) ఎక్స్‌లో హెల్ప్ ఎట్ నారా లోకేశ్, హెల్ప్ ఎట్ పవన్ కల్యాణ్, హెల్ప్ ఎట్ ఎన్‌సీబీఎన్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెట్టేవాడు. వైద్య చికిత్సల కోసం ఆర్థికసాయం అవసరమైన వ్యక్తుల వివరాలు సేకరించేవాడు. అమెరికాకు చెందినదిగా కనిపించే ఫోన్ నంబర్‌తో వాట్సప్‌లో వారిని సంప్రదించేవాడు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌గా తనను పరిచయం చేసుకునేవాడు. వైద్య చికిత్సల కోసం ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించేవాడు.
Police Arrest Fake TDP NRI Convener :వారికి విశ్వాసం కల్పించేందుకు తన వాట్సప్ ఖాతాకు డీపీగా మంత్రి లోకేశ్ ఫొటో పెట్టుకునేవాడు. నకిలీ బ్యాంకు క్రెడిట్ రసీదులు పంపి, ఆర్థికసాయం అందిస్తున్నట్లు నమ్మబలికేవాడు. కొద్దిరోజుల తర్వాత వారికి బ్యాంకు మేనేజర్‌లా ఫోన్ చేసేవాడు. నగదు జమ కావాలంటే రిమిటెన్స్ ఛార్జీలు పంపాలంటూ తన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయించుకునేవాడు. రాజేష్‌పై రాష్ట్రంలో 7, తెలంగాణలో 2 కేసులున్నాయి. తొమ్మిది కేసుల్లో రూ.54.34 లక్షల మేర ప్రజల నుంచి కొల్లగొట్టాడు. ఇతని మోసాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు సంబంధించిన 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు 16 ఫిర్యాదులు అందాయి. ఇంకా 7 కేసులు నమోదు చేయాల్సి ఉంది.