Chandrababu Meet Central Ministers :ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి సహా ఆరుగురు కేంద్ర మంత్రులు, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాలతో చంద్రాబబు వరుసగా భేటీ అయ్యారు.
భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు :మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది నాలుగేళ్లలో పూర్తవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. రిఫైనరీ ఏర్పాటుకు సుమారు 2-3 వేల ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి సూచించగా మచిలీపట్నంలో అందుబాటులో ఉందని, ఇంకా కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వివరించారు.
రాష్ట్రానికి భారీ పరిశ్రమ- మచిలీపట్నం తీరంలో బీపీసీఎల్ రీఫైనరీ? - BPCL refinery in Andhra Pradesh
భారత్ పెట్రోలియం రిఫైనరీపై కేంద్రమంత్రి పురి, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మచిలీపట్నం అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని రాజధానికి దగ్గరగా ఉండటంతో పాటు పోర్టు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని బాలశౌరి వివరించారు.
రాష్ట్రంలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం :కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సుమారు గంట సేపు సమావేశం అయిన చంద్రబాబు రాష్ట్రంలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పేందుకు భూ సేకరణకు 385 కోట్ల రూపాయలు, నిర్వహణ వ్యయంగా.. 27.54 కోట్లు విడుదల చేయాలని కోరారు.
ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ : కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన చంద్రబాబు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ 2018 నుంచి పెండింగ్‌లో ఉందని, దానికి ఆమోదం తెలపాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ రాజధాని అమరావతి అభివృద్ధిపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందని తక్షణం మంజూరు చేసి అమరావతి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు.
నీరు, విద్యుత్, రైల్వే, రోడ్డు కనెక్టివిటీ :కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వైజాగ్- చెన్నై, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవాలలో 4 పారిశ్రామిక నోడ్‌లను గుర్తించడంతో పాటు నీరు, విద్యుత్, రైల్వే, రోడ్డు కనెక్టివిటీ కోసం బాహ్య మౌలిక సదుపాయాలను అందించడానికి గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఆక్వాపార్క్ మంజూరు :కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రానికి సమీకృత ఆక్వాపార్క్ మంజూరు చేయాలని, ఉద్యాన పంటల రైతులకు సబ్సిడీని పెంచడానికి ఒక విధానాన్ని రూపొందించాలని కోరారు. NMOOP పథకం కింద కేంద్ర వాటాగా 111.29 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రుడెన్షియల్ నిబంధనల సడలింపు :అనంతరం కేంద్ర పట్టణాభివృద్ది, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కర్నూలు నుంచి వైజాగ్ వరకు HVDC ISTS లైన్ కోసం ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అదనపు ప్రుడెన్షియల్ నిబంధనల సడలింపుకు అనుమతించాలని కోరారు. వైజాగ్-కాకినాడను గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సహకారం అందించాలి :16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేంద్రం నుంచి కేటాయించాల్సిన నిధులు, రాష్ట్ర లోటు బడ్జెట్, అప్పుల నుంచి బయటపడేందుకు సహకారం అందించాలని కోరినట్లు తెలిసింది.
వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం - ఆదుకోండి - మోదీకి చంద్రబాబు వినతి - CM Chandrababu met with PM Modi