AP Cabinet Meeting Updates : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ప్రభుత్వం రూపొందించిన పాలసీకి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.
పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఎంఎస్‌ఎంఈ పాలసీలో మార్పులతో పాటు ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా పలు కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో ప్రతిపాదనలు వచ్చాయి.
సీఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపుపై కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్ల చట్ట సవరణపై చర్చించినట్లు సమాచారం. 2019లో తెచ్చిన చట్టం సవరించి కొత్త చట్టం తెచ్చే అంశంపై చర్చ జరిగింది. టీటీడీ పోటులోని కార్మికులను సూపర్‌వైజర్లుగా అప్‌గ్రేడ్ చేసే అంశం, రిజిస్ట్రేషన్ల శాఖలో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రతిపాదనపై చర్చించారని తెలుస్తోంది.
తిరుపతి జిల్లాలోని తమ్మినపట్నంతో పాటు కొత్తపట్నం సీబీఐసీలో భూములు కోల్పోయిన వారికి పరిహారం పెంపు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. వారికి ఎకరాకు రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇచ్చే ప్రతిపాదనపై చర్చ జరిగినట్లు సమాచారం. భారత్‌లో తయారైన విదేశీమద్యంపై రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణపై కూడా చర్చించారని తెలుస్తోంది. మరోవైపు రూ.44,776 కోట్ల ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.