AP Cabinet Meeting Highlights: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో 21 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అమరావతిలో 24 వేల 276 కోట్లు విలువైన పనులకు పాలనపరమైన అనుమతులిచ్చింది. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11 వేల కోట్ల రుణం, KFW ఆర్థిక సంస్థ ద్వారా 5 వేల కోట్ల రుణం పొందడానికి ఆమోదం తెలిపింది.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మగానిపల్లెలో నూతన కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు 50.21 ఎకరాలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు అంగీకారం తెలిపింది. 50 వేల వరకూ ఉన్న రుణాలపై స్టాంప్ డ్యూటీ మినహాయింపును ఆమోదించింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీకి..కేబినెట్ సమ్మతి తెలిపింది. ఈ నిధులు పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయడానికి అంగీకరించింది.
పోలవరం ఎడమ కాలువ పనుల్లో కొన్ని ప్యాకేజీలకు రీ టెండర్‌ను కేబినెట్ ఆమోదించింది. హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు సమ్మతి తెలిపింది. క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడులకు జాయింట్ వెంచర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 475 జూనియర్ కళాశాలల్లో.. మధ్యాహ్న భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. 32కోట్ల వ్యయంతో ఇంటర్ విద్యార్దులకు పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్దుల్లో నైతిక విలువలు పెంచేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ఉపన్యాసాలు ఇప్పించాలని నిర్ణయించింది.