Anganwadi Protest 40th day In Ananntapur District :అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంగన్వాడీల నిరసన సెగ తగిలింది. 23న సీఎం జగన్మోహన్ రెడ్డి ఉరవకొండ పర్యటన సందర్భంగా సభ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని అంగన్వాడీలు అడ్డుకున్నారు. దాదాపు అరగంట పాటు అంగన్వాడీ నిరసనకర్తలు రహదారిపై బైఠాయించారు. మంత్రి వాహనం రోడ్డుపై నిలచిపోయింది. పోలీసులు బలవంతంగా అంగన్వాడీలను పక్కకు తొలగించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ అంగన్వాడీలు వాహనాలకు అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కదం తొక్కుతున్న అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు - రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు
Anganwadi Protest in Andhra Pradesh : రాయదుర్గంలో స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్ అత్యుత్సాహం చూపించి అంగన్వాడీలతో ఛీవాట్లు తినాల్సి వచ్చింది. రాయదుర్గంలోని వినాయక సర్కిల్లో తమ డిమాండ్ల సాధనకోసం అంగన్వాడీ వర్కర్లు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. సమ్మె ప్రారంభించి 40 రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని అంగన్వాడీలు నినదించారు. అంగన్ వాడీ వర్కర్ల నినాదాలకు అడ్డుపడి ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నారంటూ స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్ వన్నూరుస్వామి బెదిరించే యత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ తిరగబడటంతో, మీరు ప్రభుత్వాన్ని దొంగలరాజ్యం అనకూడదని ఏదో చెప్పటానికి యత్నించగా, అంగన్ వాడీలు నీ పనిచూసుకో, మా సమస్య మీకేం తెలుసు అంటూ అంటూ కానిస్టేబుల్‌పై మండిపడ్డారు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. తమకు కూడా ప్రభుత్వం నుంచి రావల్సినవి పెండింగ్‌లో ఉన్నాయంటూ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.