Andhra Pradesh Debts: ఆర్థిక నిర్వహణ ఎలా ఉండకూడదో జగన్ సర్కార్‌ను చూస్తే సరిపోతుందేమో ! చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా, ఖజానా ఖాతాలో కనీస నిల్వ కూడా లేకుండా ఏమిటీ అప్పులు, చేబదుళ్లు అంటూ గతంలోనే కాగ్ ఎంగడట్టింది. కొంత జాగ్రత్తపడితే ఈ వడ్డీల బాధ తప్పుతుంది కదా అని సలహా ఇచ్చింది. రోజూ చేబదుళ్లు తీసుకుంటూ వడ్డీల రూపంలో వృథా ఖర్చులు చేస్తున్నారని విస్తుపోయింది. ఎప్పుడో 2021లో లెక్కలు చూసిన తర్వాతే కాగ్ అలా చెప్పింది. జగన్ సర్కార్ ఆ మాట వినకపోగా, మరింత ఎక్కువగా అప్పులు తెస్తూ భారీగా వడ్డీలూ చెల్లిస్తోంది.
2019-20లో ఏడాది మొత్తం 221 రోజులే ఇలా చేబదుళ్లు తీసుకుంటే నాలుగేళ్లు గడిచేసరికి ఏకంగా 341 రోజులు అప్పులలోనే రాష్ట్రాన్ని ముంచారు. అప్పు పుడితేనే పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు, ఏ కార్యక్రమానికైనా నిధులివ్వాలంటే రుణం తీసుకోవాల్సిందే. ఆఖరికి ఉద్యోగులు రిజర్వు బ్యాంకు వెబ్‌సైట్ చూసుకుని, రాష్ట్రం అప్పు ఎప్పుడు తెస్తుంది, ఎంత తీసుకుంటోంది, మనకు జీతం ఎప్పుడు వస్తుంది అని లెక్కలు వేసుకునే రోజులు వచ్చాయి. ఒక ప్రణాళిక లేకుండా ఎప్పుడూ ఆర్బీఐ నుంచి చేబదుళ్లు తీసుకుంటూ రాష్ట్ర ఖజానాను నడపాల్సి రావడంతో ఏటా వాటిపై చెల్లించే వడ్డీల భారమూ పెరిగిపోతోంది. సర్కార్ పెద్దలు మాత్రం అబ్బే అలాంటిదేం లేదంటారు.
కొత్త ఏడాదికి అప్పులతో స్వాగతం పలికిన సీఎం జగన్
జగన్ ప్రభుత్వం ఏ ఏడాది ఎన్ని రోజులు చేబదుళ్లు, అప్పులు తీసుకువచ్చింది ? ఎన్ని రోజులు ఓవర్ డ్రాఫ్ట్‌లో రాష్ట్రం మునిగిపోయింది అన్న లెక్కలు గమనిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ రుణాలు, గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తెచ్చే రుణాలే కాదు రోజువారీ నిర్వహణ కోసం రిజర్వు బ్యాంకు ఇచ్చే చేబదుళ్లు, ప్రత్యేక సదుపాయం రుణాలూ తీసుకుంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్ వెసులుబాటు వినియోగించుకుంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తుండాలి. ఆ చేబదుళ్లకు వడ్డీలూ కట్టాలి. అదీ ఒక రకమైన అప్పే.