Investigation To Illegal Gravel Mining In Guntur District:వైఎస్సార్సీపీ హయాంలో గుంటూరు జిల్లాలో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభమైంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణకు ఆదేశాలతో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తవ్వకాలతో పడిన భారీ గుంతల్లో నీరు నిలవడంతో గుట్టు తేల్చలేమన్న అధికారులు హైదరాబాద్ నుంచి నిపుణులను పిలిపిస్తామని తెలిపారు.
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ:గత వైఎస్సార్సీపీ పాలనలో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ మొదలైంది. పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ నేతలు తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకున్నారు. జగనన్న కాలనీలు, రైల్వే మార్గం పనులు, హైవేల నిర్మాణం పేరిట చేబ్రోలు మండలంలో పలు గ్రామాల్లోని మట్టి ఇష్టారీతిన తవ్వేశారు. అనుమతులు కొంత, అక్రమాలు కొండంత అన్నట్లుగా ఐదేళ్లు రెచ్చిపోయారు. అధికారులు సైతం తూతూమంత్రంగా తనిఖీలు సరిపెట్టారే తప్ప నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కనీస చర్యలు తీసుకోలేదు. అక్రమ తవ్వకాలతో వీరనాయకునిపాలెం, శలపాడు, శేకూరు, సుద్దపల్లి గ్రామాల్లో 40 నుంచి 80 అడుగుల లోతున గోతులు పడ్డాయి.
ఎన్టీటీ ఆదేశాలతో విచారణ:ఈ అక్రమ తవ్వకాలపై వీరనాయకునిపాలెం గ్రామస్తులు కొందరు ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి ఎన్టీటీ ఆదేశాలివ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. తెనాలి సబ్‌కలెక్టర్ సంజనా సిన్హా ఆధ్వర్యంలోని బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ తవ్వకాలు జరిగినట్లు నిర్ధరించింది. అయితే ఏ స్థాయిలో జరిగాయో కొలతలు తీయడానికి నీటి నిల్వలు అడ్డుగా ఉండటంతో నిపుణులను రప్పించాలని బృందం నిర్ణయించింది. అందుకుగాను హైదరాబాద్ నుంచి నిపుణులు వచ్చి అక్రమ తవ్వకాల లెక్కలు తేల్చనున్నారు.
వైఎస్సార్సీపీ నేతలు భూగర్భం వరకు తవ్వకాలు చేపట్టి మట్టి తరలించే సమయంలో స్థానికులు పలుమార్లు ఆందోళనలు చేశారు. పంట పొలాలు పాడైపోతున్నాయని, రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మట్టి తవ్వకాలపై విచారణ చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నియమించిన బృందం పరిశీలించి చేబ్రోలు మండల పరిధిలో 33 చోట్ల అక్రమ తవ్వకాలు చేసి 4 లక్షల 44 వేల క్యూబిక్ మీటర్లు మట్టి తరలించినట్లు గుర్తించింది.