Amaravathi Farmers Paid Tribute to Ramoji Rao :ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు రాజధాని అమరావతి రైతులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజధానికి పేరు సూచించడమేగాక, అమరావతి పరిరక్షణలో అక్షర సమరం సాగించారంటూ తుళ్లూరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
తెలుగువారి అక్షర కీర్తి రామోజీరావు మరణానికి నివాళిగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాజధాని రైతులు, మహిళా ఉద్యమకారులు తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ చేశారు. రామోజీరావు చిత్రపటాన్ని చేతుల్లో పట్టుకుని ఉద్యమకారులు ముందుకు సాగారు. అందరూ మెచ్చేలా రాజధానికి అమరావతి పేరును రామోజీరావే సూచించారని రైతులు గుర్తు చేసుకున్నారు. అమరావతి విధ్వంసానికి వైఎస్సార్సీపీ సర్కార్ చేసిన కుటిలయత్నాల్ని తిప్పికొట్టడంలో ఈటీవీ, ఈనాడు ద్వారా తమకు అండగా నిలిచారని కొనియాడారు.
అమరావతికి మళ్లీ ఊపిరిపోయడంలో రామోజీరావు పాత్ర చరిత్ర ఉన్నంత వరకూ నిలిచే ఉంటుందని అమరావతి ఐకాస నాయకులు అన్నారు.
LIVE "రామోజీరావు - మీడియా మహానాయక్" కార్యక్రమం - ఒడిశా నుంచి ప్రత్యక్షప్రసారం - Odisha Media Tribute to Ramoji Rao
అక్షరాన్నే వజ్రాయుధంగా చేసు కొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అలుపెరుగని కృషి చేసిన అక్షరయోధుడు రామోజీరావు అని రాజధాని రైతులు కొనియాడారు. సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించగల మహాశక్తిని ఇచ్చిన మహానుభావుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. రాజధాని కోసం అన్నదాతలు చేసిన ఉద్యమాన్ని ప్రపంచం నలుమూలలకూ చూపిన గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు చిత్రపటాలు చేతపట్టుకుని జోహార్ రామోజీరావు, అక్షరయోధుడు, ప్రజాస్వామ్య పరిరక్షకుడు రామోజీరావు జోహార్- సమాజ చైతన్యానికి స్ఫూర్తిప్రదాత జోహార్- అమరావతి పరిరక్షకుడా, అలుపెరగని యోధుడా జోహార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమరావతి ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాసరావు, అమరావతి ఐకాస నాయకులు శివారెడ్డి, వెలగపూడి రామకృష్ణ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కన్వీనర్ మేళం భాగ్యారావు తది తరులు ర్యాలీలో పాల్గొని రామోజీరావుకు నివాళులర్పించారు.
కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద రైతులు మానవహారంగా ఏర్పడ్డారు. రామోజీరావు మరణానికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
రామోజీరావుకు ఆర్మీ మాజీ ఉద్యోగుల ఘన నివాళి - tribute to Ramoji Rao