ALLU ARJUN RELEASE UPDATES :చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ విడుదల అయ్యారు. చంచల్‌గూడ జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్‌ను అధికారులు పంపించారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా నివాసానికి అల్లు అర్జున్‌ను పంపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ అరెస్టు అయ్యారు. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్ ఉన్నారు. ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదలయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 18 మందిని నిందితులుగా చేర్చగా, ఇందులో ఏ11గా అల్లు అర్జున్ ఉన్నారు.
భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు: జైలు నుంచి విడుదలైన అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరారు. సుమారు గంటకు పైగా గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే ఉన్నారు. 45 నిమిషాలపాటు న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపారు. తరువాత అభిమానులకు అభివాదం చేసుకుంటూ వాహనం ఎక్కారు. అక్కడ నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. సతీమణి, పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అల్లు అర్జున్‌ను చూసి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంటి వద్ద అభిమానులకు అభివాదం చేశారు.
అర్ధరాత్రి వరకు ఉత్కంఠ: కాగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్టయిన అల్లు అర్జున్ విడుదలపై అర్ధరాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా, పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10.30 గంటలకు అందడంతో అర్జున్‌ను చంచల్‌గూడ జైల్లోనే ఉంచారు. ఇవాళ ఆయనను విడుదల చేయనున్నట్టు జైలు అధికారులు తెలిపారు.
అరెస్టు, రిమాండ్, అనంతరం మధ్యంతర బెయిల్: ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్, అనంతరం మధ్యంతర బెయిల్‌తో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిక్కడపల్లి పోలీసులు ఆయనను శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి, వాంగ్మూలం, వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు గేటు వద్ద అల్లు అర్జున్ ఏఆర్ సిబ్బందితో గొడవ పడినట్టు సమాచారం. జైల్లో ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించారు. ఇదే బ్యారక్‌లో ఇతర కేసులకు సంబంధించిన ఇద్దరున్నారు. జైలులో కొంతసమయం ముభావంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అల్లు అర్జున్ కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.