జగన్ సభకు బస్సులు - జనానికి తప్పని తిప్పలు Allotment of RTC Buses for CM Jagan Meetings:సీఎం జగన్ గుంటూరు 'మేమంతా సిద్ధం' సభకు ఆర్టీసీ పెద్దఎత్తున బస్సులను కేటాయించింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి 11 వందల 50 బస్సులు ఇవ్వడంతో ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు. వరుసగా సెలవులు రావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధమైన వారికీ అవస్థలు తప్పవు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సులు కేటాయించాల్సిన ఆర్టీసీ ఉన్నతాధికారులు అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి అడిగినన్ని బస్సులు కేటాయించడంపై నగరవాసులు మండిపడుతున్నారు.
జగన్ సభలకు ఆర్టీసీ బస్సులు- మండుటెండలో ప్రయాణికుల అవస్థలు - CM Meeting People Problems
గుంటూరులో నేడు వైసీపీ మేమంతా సిద్ధం సభ జరగనుంది. నేతలు జగన్ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తల తరలింపు కోసం ఏడు జిల్లాల నుంచి 11 వందల 50 బస్సులు కేటాయించారు. నెల్లూరు నుంచి 250, ప్రకాశం నుంచి 210, పల్నాడు నుంచి 220, ఎన్టీఆర్ జిల్లా నుంచి 100, కృష్ణా జిల్లా నుంచి 70, బాపట్ల జిల్లా నుంచి 100, గుంటూరు జిల్లా నుంచి 200 బస్సుల ద్వారా జనాన్ని సభలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి గురువారం రాత్రి బస్సులు బయలుదేరి గుంటూరు జిల్లాలో వివిధ మండలాల్లో కేటాయించిన ప్రాంతాలకు చేరుకోవాలి.
సామాన్యులకు శాపంగా జగన్ సభలు - బస్సుల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూపులు - Problems with Jagan bus yatra
రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవుదినాలు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ వృత్తుల వారు పనిచేస్తున్న ప్రాంతం నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి శుక్రవారం సాయంత్రం నుంచి బయలుదేరుతారు. వీరందరికీ ప్రయాణకష్టాలు తప్పేలా లేవు. నెలలో ఒక రోజు అయితే ప్రయాణం వాయిదా వేసుకోవడం, సర్దుకుపోవడం చేస్తారు. మూడు రోజుల్లోనే రెండుసార్లు ఆర్టీసీ బస్సులు వైసీపీ సేవలో తరించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు నగరం చుట్టుపక్కల పల్లెల నుంచి రోజూ కూలీపనులకు వస్తూ తిరిగి రాత్రికి ఇంటికి వెళ్లేవారు వేలసంఖ్యలో ఉన్నారు. వీరందరూ ఉదయాన్నే ఆయా గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చి తిరిగి బస్సుల్లోనే ఇంటికి వెళుతుంటారు.
సీఎం బస్సు యాత్రా మజాకా - ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు - jagan bus yatra traffic diversions
బుధవారం పిడుగురాళ్ల సిద్ధం సభ, శుక్రవారం గుంటూరులో సభకు బస్సులు కేటాయించడంతో నగరాలు, పట్టణాల సమీప పల్లెలకు బస్సులు పూర్తిగా రద్దు చేశారు. వారంతా ఆటోల్లో అధికఛార్జీలు చెల్లించడంతో పాటు రెండు ఆటోలు మారి గమ్యస్థానాలు చేరుకోవాల్సి వస్తోంది. వైసీపీ మేమంతా సిద్ధం సభకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కేటాయిస్తున్నారు. దానివలన ఆయా మార్గాల్లో సర్వీసులను పూర్తిగా రద్దుచేయడం లేదా నామమాత్రంగా నడుపుతున్నారు. మండుటెండలు, బస్సుల కొరతతో సకాలంలో గమ్యానికి చేరుకోలేక ప్రయాణికులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు.