గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం - టీడీపీలోకి భారీగా చేరికలు Alliance Leaders Election Campaign in Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశంలోకి చేరికల జోరు కొనసాగుతోంది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మోదేపల్లిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా మహిళలు ఘనస్వాగతం పలికారు.
వైఎస్ వివేకా హత్య ప్రధానాంశంగా పులివెందులలో షర్మిల ఎన్నికల ప్రచారం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్దప్రసాద్ నివాసంలో 100 యానాది కుటుంబాలు జనసేనలో చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో జనసేన అభ్యర్థి కందుల దుర్గేశ్ సుడిగాలి ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు మూడు పార్టీల నేతలతో ఆత్మీయ సదస్సు నిర్వహించగా ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారు.
టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు: విజయనగం జిల్లా రాజాం టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ సమక్షంలో 170 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. విజయనగరం వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి సీఎంఆర్ కూడలి నుంచి కోట కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీ నాయన సమక్షంలో పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి సుజయ్ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనాయుడుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. పార్వతీపురం జిల్లా సాలూరు వైసీపీకి గట్టిదెబ్బ తగిలింది. 400 మంది వైసీపీ నేతలు కుటుంబాలతో కలిసి కూటమి అభ్యర్థి సంధ్యారాణి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. బంగారమ్మ కాలనీలో ఆమె ప్రచారం చేపట్టగా మంచి స్పందన లభించింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు గ్రామంలో ఉన్న ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమైన బాలకృష్ణ - అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు
ఓట్లు అభ్యర్థిస్తున్న కూటమి నేతలు: కర్నూలు జిల్లా పెద్దకాడబూరు మండలం ముచ్చిగిరిలో కూటమి అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి సమక్షంలో 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని ప్రతివార్డులో ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మిగనూరులో 300 మంది కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోనెగండ్లలో తెలుగుదేశం నేతలు జయహో బీసీ బహిరంగ నిర్వహించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు సమక్షంలో 500 కుటుంబాలు వైసీపీని వీడి సైకిలెక్కాయి. ఉరవకొండ మండలం మోపిడిలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరఫున ఆయన కుమారుడు పయ్యావుల విక్రమసింహ ఇంటింటి ప్రచారం చేశారు. సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎస్టీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిలమత్తూరు మండలం సోమఘట్టలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి బాలయ్యను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
ముమ్మరంగా కొనసాగుతున్న టీడీపీ ప్రచారాలు - కూటమితోనే అభివృద్ది సాధ్యమని వెల్లడి
నెల్లూరు జిల్లా వింజమూరులో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేశ్ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. నెల్లూరులో టీడీపీ అభ్యర్థి నారాయణ సుడిగాలి ప్రచారం చేశారు. వేమిరెడ్డిని ఎంపీ, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నీలకుంట గ్రామానికి చెందిన 15 కుటుంబాలు మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఎన్డీయే నేతలతో రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ స్కీమ్స్ ప్రచారంతో దూసుకెళ్తోన్న టీడీపీ - TDP Candidates State Wide Campaigns