Alliance Government has Completed Pending Works at Vizzy Stadium :గత ప్రభుత్వం క్రీడారంగాన్ని నిర్లక్ష్యం చేసిందనేందుకు విజయనగరంలోని విజ్జీ స్టేడియమే నిదర్శనం. 6 కోట్ల రూపాయలతో 90 శాతం పూర్తయిన మల్టీపర్పస్ ఇండోర్ మైదానాన్ని ఐదేళ్లూ పట్టించుకోలేదు. మిగిలిన 10 శాతం పనులకు 30లక్షల రూపాయలు కేటాయించేందుకు చేతులు రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ చొరవతో మైదానానికి పూర్వవైభవం వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసి విజయనగర ఉత్సవాల కానుకగా క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు.
ఇండోర్ స్టేడియానికి 2019లో అడుగులు :అన్ని రకాల ఆటలకు అనువుగా ఉండేలా విజ్జీ క్రీడామైదానంలో ఇండోర్ స్టేడియానికి 2019లో అడుగులు పడ్డాయి. కేంద్రమాజీమంత్రి అశోక్‌గజపతిరాజు చొరవతో 6కోట్ల రూపాయలతో అప్పటి పాలకులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. షటిల్, టెన్నిస్, వాలీబాల్, కబడ్డీ, చదరంగం, ఫెన్సింగ్, ఆర్చరీ, రైఫింగ్, షూటింగ్ సాధనకు తగ్గట్లుగా ఏర్పాటు చేశారు. ఉడెన్ కోర్టు, విద్యుత్ సౌకర్యం, ఫ్లోరింగ్ వంటివి మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. వీటికోసం 30 లక్షల రూపాయలు అవసరం. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇండోర్ స్టేడియంపై శీతకన్ను వేసింది.
కోట్లాది రూపాయల భవనం వృథా : ఐదేళ్లలో మిగిలిన పనులు పూర్తిచేయలేకపోయింది. కోట్లాది రూపాయల భవనం వృథాగా మారింది. ఆకతాయిల చేష్టలతో కిటికీల అద్దాలు, భవనం వెలుపల విద్యుత్తు స్విచ్ బోర్డులు పాడైపోయాయి. ఇండోర్ స్టేడియాన్ని పట్టించుకోవాలని అప్పట్లో పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అనతికాలంలోనే దీనిపై దృష్టి సారించింది. ఇండోర్ స్టేడియంలో మిగిలిన 10శాతం పూర్తి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు. ఈ నెల 13, 14న జరగనున్న విజయనగరం ఉత్సవాల నాటికి స్టేడియాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.