Alliance Candidates Election Campaign in AP : ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు దూకుడు పెంచారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని తెలుపుతున్నారు. ఏపీ బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావలని ప్రజలకు స్పష్టం చేస్తున్నారు.
మంచివారు పార్టీలో ఉండలేరంటూ వైసీపీని వీడుతున్న శ్రేణులు-టీడీపీలోకి జోరుగా చేరికలు
ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య తీర్చటమే లక్ష్యం పని చేస్తానని హామీ ఇచ్చారు. నందిగామ నియోజకవర్గ ప్రజలే తన బలం, బలగమని ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ శివారు అనాసాగరం ఒకటో వార్డులో ఆమె పర్యటించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులతో కూటమి అభ్యర్థి సృజనా చౌదరి అల్పాహార సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే వ్యాపారస్తులకు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
కూటమి అభ్యర్థులకు ఘన స్వాగతం : శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో కొత్తూరు, మరదరాజపురం, జగన్నాథపురం గ్రామాల్లో కూటమి అభ్యర్థి గౌతు శిరీషా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఆమదాలవలస మండలం కనుగులవలస పంచాయతీలో కూటమి అభ్యర్థి కూన రవికుమార్ ప్రచారం చేపట్టారు. విజయనగరం నియోజకవర్గ కూటమి అభ్యర్ధి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆధ్వర్యంలో 'మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ ' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెద్ద తీనార్లలో కూటమి ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనితకు పార్టీ నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. విశాఖ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో యువత భవితకు భరోసా కార్యక్రమంలో విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పాల్గొన్నారు.