Adani Bribe to YS Jagan :ఒక దస్త్రం ఆర్థికశాఖలో కార్యదర్శి నుంచి కిందిస్థాయి వరకు నాలుగైదు దశల్లో వడపోత తర్వాత ఆమోదం ముద్ర పడుతుంది ఈ దశల్లో ఎదైనా కొర్రీ వేస్తే మళ్లీ సంబంధిత శాఖకు వచ్చి వెళ్లాల్సిందే. కానీ సెకి దస్త్రానికి మాత్రం మినహాయింపు. అధికారులు ఆమోదముద్ర వేసి పంపడానికి పట్టిన సమయం 7 గంటలు. అదీ అర్ధరాత్రి. రూ.1.10 లక్షల కోట్ల విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన దస్త్రాన్ని ఆర్థికశాఖ ఆఘమేఘాల మీద ఆమోదం తెలిపింది. దీనివెనుక సర్కార్ పెద్దలు ఎంతగా ఒత్తిడి చేయకుంటే దస్త్రం ఇంతలా పరుగులు పెడుతుంది?
- అది 2021 సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్ర 5:30 గంటలు. మిగిలిన కార్యాలయాన్నీ మూతపడ్డాయి. ఆర్థికశాఖ, ఇంధనశాఖ, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) సిబ్బంది మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. కారణం మర్నాడు జరిగే కేబినెట్ సమావేశానికి సెకి దస్త్రం పంపాలని సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరకపోగా 25 సంవత్సరాల్లో ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని నిపుణుల అంచనా. సెకి ఒప్పందం ద్వారా జగన్‌కు లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. దీంతో ఆ ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దస్త్రం సిద్ధం చేయడంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం
రాత్రికి రాత్రే - దస్త్రం తయారు :జగన్ సర్కార్ 10 గిగావాట్ల సోలార్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు టెండర్లు పిలిచింది. అయితే ప్రాజెక్టుల ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని దానికి ప్రత్యామ్నాయంగా సెకి నుంచి విద్యుత్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అది తీసుకోడానికి ముందు ఎంత కసరత్తు జరగాలి? కరెంట్ తీసుకుంటే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి? అంత విద్యుత్ వినియోగించగలమా? ప్రజలపై ఎలాంటి ఆర్థికభారం పడుతుంది? ఇలాంటి లెక్కలు వేయాలి. ఎంత లేదన్నా కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది.
కానీ జగన్ సర్కార్‌కి మాత్రం గంటల వ్యవధి చాలట! సెకి నుంచి ప్రతిపాదన అందిన మర్నాడే మంత్రిమండలి సమావేశం పెట్టి ఆమోదం తెలిపింది. 7000ల మెగావాట్లు కొనేందుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. లాభనష్టాలను అంచనా వేయకుండా అంత గుడ్డిగా ముందుకు వెళ్లిందంటే ప్రజా ప్రయోజనాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
2021 సెప్టెంబర్ 15న రాష్ట్రప్రభుత్వానికి సెకి తొలిసారిగా ప్రతిపాదన అందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద 9 గిగావాట్ల సౌరవిద్యుత్ కొనాలని ప్రతిపాదించింది. సెకి నుంచి ప్రతిపాదన రాగానే దస్త్రం తయారీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నుంచి ఆదేశాలు అందాయి.