Akshaya Patra Preparing Food for Flood Victims:గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరేరామ హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అక్షయపాత్ర మరో అరుదైన రికార్డును సాధించింది. అక్షయపాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం 5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం చేసింది. ప్రభుత్వం, దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయపాత్ర అధికారి విలాస దాసప్రభు చెప్పారు. వరద బాధితుల కోసం మంచి రుచికరమైన, పౌష్టికాహారాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు.
మొదటి రోజు 60 వేలు, 2వ రోజు లక్ష, 3వ రోజు 2 లక్షలు, 4వ రోజు 5 లక్షల మంది వరద బాధితులకు ఆహారాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో తయారైన ఆహారాన్ని ప్యాకింగ్ చేసేందుకు స్వచ్ఛందంగా మహిళలు, వివిధ సంస్థలు, అసోసియేషన్ సిబ్బంది, మెప్మా, మహిళా పోలీసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ఆహారాన్ని సక్రమంగా బాధితులకు అందించేందుకు మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు పెద్ద కసరత్తు చేస్తున్నారు.
గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి పురపాలక సంఘం నుంచి రోజుకు 400 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఏయే వాహనం ఎక్కడికి వెళ్లాలి ఎన్ని ఆహార ప్యాకెట్లు పంపుతున్నారని కచ్చితంగా లెక్కవేసి మరీ పంపుతున్నారు. ఆహారాన్ని బాధితుల వద్దకు చేరేవేసేందుకు ఆయా పాఠశాలలు, కళాశాలల యజమానులు ఉచితంగా వాహనాలు పంపుతున్నారు. ఈ వాహనాల్లోకి ఆహార ప్యాకెట్లు ఎక్కించేందుకు మంగళగిరికి చెందిన మోటారు మెకానిక్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.