Akshaya Patra Preparing Food for Flood Victims : బుడమేరు, కృష్ణా వరదల్లో చిక్కుకుని బాధితులు విలవిల్లాడుతున్నారు. వీరికి అక్షయపాత్ర (హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్) వరప్రదాయినిగా మారింది. వరదనీరు చుట్టుముట్టి ఆకలిదప్పులతో అలమటిస్తున్న విజయవాడ ప్రజలకు వేగంగా ఆహారాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వ భావించింది. ఈ కృతనిశ్చయానికి తోడ్పాటుగా అక్షయపాత్ర నిలిచింది. వందలు, వేలు కాదు లక్షల మంది బాధితులు. వరద ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఒకపూట, రెండు పూటలు కాదు రోజుల తరబడి ఆహారాన్ని అందించాలి. ఇంతటి విపత్కర కాలంలో వారికి సంస్థ అండగా నిలిచింది. రాత్రి, పగలనే తేడా లేకుండా నిర్విరామంగా శ్రమిస్తూ ఆదివారం నుంచి ఇప్పటివరకు 10.30 లక్షల మందికి సరిపడా ఆహారాన్ని సరఫరా చేసింది.
గంటన్నరకు 45 వేల మందికి ఆహారం తయారీ :అక్షయపాత్ర ఫౌండేషన్ సంస్థ ఆహార తయారీ కేంద్రం మంగళగిరి సమీపంలో ఉంది. ఈ సంస్థ మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలోని 315 పాఠశాలల్లో ఉన్న 25,000ల మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారాన్ని లాభాపేక్ష లేకుండా తయారుచేస్తుంది. గంటన్నరలో 45,000ల మందికి సరిపడా అన్నం సిద్ధం చేసేలా వంటశాల యంత్రాలను రూపొందించారు. సాంబారు, సాంబారు రైస్ కూడా అదేస్థాయిలో సిద్ధం చేసే యంత్రాలూ అక్కడ ఉన్నాయి.
మరోవైపు రెండు నిమిషాల్లో 250 కిలోల పులిహోరను కలిపే యంత్రాలు అందుబాటులో ఉంచారు. దీన్ని గుర్తించిన సర్కార్ వరద బాధితులకు ఆహారాన్ని అందించేందుకు అక్షయపాత్రను పురమాయించింది. డబ్బులిస్తామని, ముందు తయారీ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. వరద బాధితులకు గతంలోనూ అండగా నిలిచిన ఆ సంస్థ తాజా పరిస్థితికి అనుగుణంగా బాధితులకు అండగా నిలిచేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తోంది. ప్రతి నాలుగు గంటల్లో లక్షమందికి సరిపడా ఆహారాన్ని సిద్ధంచేసి ప్రభుత్వానికి అందిస్తుంది.
ఒక్కోరోజు ఒక్కో రకం ఆహారం : వరద బాధితులకు మూడు పూటలా ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు 275 మంది పనిచేస్తున్నారు. సాంబారు రైస్, టమాటా బాత్,పొంగలి,టమాటా రైస్, కర్డ్‌రైస్, సాంబార్ అందిస్తున్నారు. రోజూ 60,000ల మందికి సరిపడా ఆహారాన్ని అన్నక్యాంటీన్లకు అందిస్తూనే వరద బాధితులకు 24 గంటలూ ఆహారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం రోజుకు 10 టన్నుల బియ్యం, 8 టన్నుల కూరగాయలు, 2 టన్నుల ఉప్పు, 2 టన్నుల నూనె, 5 టన్నుల కందిపప్పు, మిగతావి 200, 300 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. ఏ రోజుకారోజు నిత్యావసరాలను కొంటూ ఎప్పుడూ వారం రోజులకు సరిపడా నిల్వలు ఉండేలా చూసుకుంటారు. సర్కార్ సమకూర్చే వాహనాల్లోకి ఆహారాన్ని లోడ్ చేసేందుకు 9 మంది చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో 27 మంది పనిచేస్తున్నారు.