Agriculture Minister Atchannaidu On Crop Damage in Assembly : రైతులకు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీపికబురు చెప్పారు. వర్షాలు లేక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుందని తెలిపారు. 5 జిల్లాల్లోని 54 మండలాలను కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. 1.06 లక్షల హెక్టార్లలో పంట, 1.44 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు ఇప్పటి వరకు తేలిందన్నారు. దీనికోసం రూ.159.20 కోట్లు నిధులు మంజూరు చేశామని, త్వరలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు.
నష్టపోయిన రైతులందరికీ పరిహారం : ఈ నెల 28 తేదీ వరకు సమగ్ర అంచనాలు వేసి నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరవు పీడిత మండలాల అంశంపై శాసన మండలి సభ్యుల ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఇప్పటికే రూ.33.3 కోట్ల ఖర్చుతో 1.92 లక్షల రైతులకు 47 వేల క్వింటాళ్ల విత్తానాలు 80 శాతం సబ్సిడీతో అందించినట్లు మంత్రి వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు వరదలో రైతులు నష్టపోగా 20 రోజుల్లోనే రూ.320 కోట్లు ను నష్టపోయిన రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో 80 శాతం కౌలు రైతులకు నేరుగా ప్రభుత్వం పరిహారం ఇచ్చిందన్నారు. సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన శాటిలైట్ సిస్టం సహా సాంకేతికతతో వర్షపాతం వివరాలను నమోదు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు - ఎవరైనా కాదంటే రండి తేల్చుతా : సీఎం చంద్రబాబు