ADCL Tenders in Amaravati Works : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. పెండింగ్ పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాజధానిలో చేపట్టనున్న పనులకు సంబంధించి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) టెండర్లు పిలిచింది. మిగిలిన తొమ్మిది రహదారుల పనుల కోసం రూ.2,903.76 కోట్లతో బిడ్లను ఆహ్వానించింది. ఇందులో ఈ2, ఈ5, ఈ7, ఈ11, ఈ13, ఈ15, ఈ4, ఎన్8, ఎన్13 రోడ్ల నిర్మాణాలు ఉన్నాయి.
వీటితో పాటు వాన నీటి మళ్లింపు పనులు, మురుగునీటి డ్రెయిన్లు, భూగర్భంలో విద్యుత్, ఇంటర్నెట్ తీగల కోసం డక్ట్‌లు, పాదచారులు నడిచేందుకు బాటలు, అవెన్యూ ప్లాంటేషన్, సైక్లింగ్ చేసే వారి కోసం ప్రత్యేక ట్రాక్‌లు, తదితర వసతులను ఏర్పాటు చేయనున్నారు. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 3న సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు విధించారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు.
Amaravati Capital Works :నిబంధనల సవరణతో ఎక్కువ మందికి అవకాశం పనులకు సాధ్యమైనంత ఎక్కువ మంది గుత్తేదారులు పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. సర్కార్ టెండర్ల నిబంధనల్లో మార్పులు చేసింది. సీఆర్డీఏ, ఏడీసీఎల్ కొత్తగా పిలిచే టెండర్లకు ఇవి వర్తిస్తాయి. ఇప్పటి వరకు కేవలం కొద్దిమంది మాత్రమే బిడ్లు దాఖలు చేస్తున్నారు. ఇకపై ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనే వీలుంది. దీని వల్ల పోటీతత్వం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.