ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేనత్త కుటుంబంపై పగ - యూట్యూబ్​లో శోధించి మరీ చోరీ - THEFT BY WATCHING VIDEOS ON YOUTUBE

పొలం తగాదా - ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా దెబ్బతీయాలని ప్లాన్​ - వారంతా ఊరెళ్లగానే దొంగతనం - పోలీసులకు దొరికిపోయిన యువకుడు

theft_by_watching_videos_on_youtube
theft_by_watching_videos_on_youtube (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2024, 3:41 PM IST

Theft by watching videos on YouTube :ఆ యువకుడి వయసు 21 ఏళ్లు. వ్యవసాయం చేస్తుంటాడు. పొలం గొడవలతో మేనత్త కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని పన్నాగం పన్నాడు. ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. పోలీసులకు దొరకకుండా దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్​లో చూసి కారప్పొడి చల్లే పద్ధతిని ఎంచుకున్నాడు. ఆ ప్రకారం చోరీ చేసి ఇళ్లంతా కారం పొడి చల్లి అక్కడ నుంచి పరారయ్యాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెలో గత నెల జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టడంతో అతని పన్నాగం బయటపడింది.

ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెకు చెందిన మునెయ్య ఆర్టీసీలో ఏఎస్ఐ. ఆయన భార్య గంగమ్మకు వేముల మండలం రాచకుంటపల్లెకు చెందిన మనోహర్ సోదరుడు. మనోహర్ అప్పుల బారి నుంచి బయటపడేందుకు పొలం అమ్మాలని నిర్ణయించుకోగా గంగమ్మ అడ్డుపడింది. పొలం విషయంలో అన్నాచెల్లెల కుటుంబాల మధ్య మనస్పర్థలు రాగా, మనోహర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, తన తండ్రి మరణానికి మేనత్త గంగమ్మే కారణమని భావించిన మనోహర్ కుమారుడు వినోద్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. వారిని ఆర్థికంగా దెబ్బతీయాలని అవకాశం కోసం కాచుకొని ఉన్నాడు. మేనత్తతో మంచిగా ఉంటున్నట్లు నటిస్తూనే అన్ని విషయాలు తెలుసుకునేవాడు. మాటల సందర్భంలో గంగమ్మ తాము నవంబరు 9న బెంగళూరు వెళ్తున్నామని చెప్పింది.

ఇదే అదనుగా భావించిన వినోద్ ఈ నెల 10న మేనత్త ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండాలని భావించి నేరాల తీరును యూట్యూబ్​లో శోధించాడు, పోలీసు జాగిలాలు పసిగట్టకుండా ఇళ్లంతా కారంపొడి చల్లి రూ.4.60 లక్షల విలువైన 15.5 తులాల బంగారు ఆభరణాలు, పాసు పుస్తకాలు అపహరించాడు. ఈ నెల 12న తెల్లవారుజామున బెంగళూరు నుంచి ఇంటికి చేరుకున్న మునెయ్య కుటుంబం తమ ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా విచారణ చేపట్టారు. వినోద్​పై అనుమానంతో ప్రొద్దుటూరు-మైదుకూరు రోడ్డులో అరెస్టు చేశారు. చోరీ సొత్తు రికవరీ చేసుకుని వినోద్​ను రిమాండుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details