The joy of baby girl :తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన వార్తల్లోకెక్కింది. ఓ వ్యక్తి గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఆయా కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా చీరెలు అందించాడు. అందుకు కారణం లేకపోలేదు. ఉద్యోగం చేసుకునే అతడు ఊరంతా చీరెలు పంచడం వెనుక పెద్ద తతంగమే ఉంది.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో ఓగులపు అజయ్ బతుకుదెరువు కోసం గతంలో దుబాయ్ వెళ్లాడు. అక్కడే పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అక్కడ పనిచేస్తుండగా రూ.30 కోట్ల లాటరీ అతడిని వరించింది. దీంతో ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయిన అజయ్ స్వగ్రామానికి వచ్చేశాడు. వివాహం చేసుకుని హ్యాపీగా సెటిలైపోయాడు. ఇదిలా ఉండగా 30కోట్ల లాటరీకి మించిన అదృష్టం వరించడంపై అజయ్ అనందానికి హద్దుల్లేకుండా పోయింది. తన కోరిక నెరవేరడంతో ఇంటింటికీ ఉచితంగా చీరలు పంపిణీ చేశానని అజయ్ పేర్కొన్నాడు.
తనకు ఆడపిల్ల పుట్టడం 30 కోట్ల రూపాయలకు మించిన ఆనందం ఇచ్చిందని అజయ్ తెలిపాడు. ఆడపిల్ల జన్మించడంతో పండుగలా మురిసిపోయాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చీరలు పంచి వేడుక చేసుకున్నాడు. ఇంటింటికీ తిరుగుతూ దాదాపు 1500 చీరలను పంపిణీ చేశారు. ఆడపిల్ల పుట్టిందంటేనే మొహం చాటేసే ఈ రోజుల్లో అజయ్ వేడుకలా జరుపుకోవడం విశేషం. లాటరీలో వచ్చిన 30 కోట్ల డబ్బుకు మించిన అనందం ఇదేనని చెప్పాడు.