Hyderabad Man Died Russia-Ukraine war : ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి అక్కడి ఏజెన్సీ చేతిలో మోసపోవడంతో, రష్యన్ ఆర్మీలో చేరి హైదరాబాద్ యువకుడు ప్రాణాలు వదిలాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహ్మద్ అఫ్సాన్(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు.
నాంపల్లిలోని బజార్‌ఘట్‌కు చెందిన అఫ్సన్(Mohammad Afsan) మృతి చెందినట్టు, రష్యాలోని ఇండియన్ ఎంబసీ నుంచి తమకు సమాచారం వచ్చిందని అఫ్సాన్ సోదరుడు ఇమ్రాన్ పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఏజెంట్ల సాయంతో అఫ్సాన్ ముందుగా దుబాయ్ చేరుకున్నాడని, అక్కడ నుంచి ఏజెంట్లు అతన్ని మాస్కో తరలించారని ఆయన తెలిపారు. అక్కడ కొన్ని పత్రాలపై అఫ్సాన్తో సంతకాలు చేయించుకుని, రష్యా సైన్యంలో స్లీపర్ ఉద్యోగం అంటూ సైన్యంలో చేర్పించారని పేర్కొన్నారు.
రెండు రోజుల శిక్షణ తర్వాత అఫ్సాన్ సైన్యంలో విధులు నిర్వర్తించాడని, తన సోదరుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని రష్యాలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించగా అక్కడి అధికారులు ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించాలని కోరారు. అఫ్సాన్ను తప్పుదోవ పట్టించి సైన్యంలో చేర్పించిన ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.