76th Republic Day Celebrations Across The State:రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో జెండా ఆవిష్కరణ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు: అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, ఓటుహక్కు కల్పించిందని అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శాసనమండలి ఛైర్మన్:శాసనమండలిలో ఛైర్మన్ మోషేన్ రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని మోషేన్ రాజు తెలిపారు. పాఠ్యాంశాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీఎస్ కె.విజయానంద్ మిఠాయిలు పంచారు..
హైకోర్టులో.. హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమైక్య స్ఫూర్తిని పెంపొందించుకుని ప్రతి ఒక్కరూ ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగాలని అందరికీ పిలుపునిచ్చారు.
నెల్లూరులో..నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ ఆనంద్ జెండా ఎగురవేసి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని పెంపొందించేలా సాగిన సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
కడప జిల్లాలో..కడప పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. డాగ్ స్వ్కాడ్ విన్యాసాలు అలరించాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్వాతంత్య సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు.