ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చరిత్రకెక్కని నెత్తుటి వీరగాథ - వీర బైరాన్‌పల్లి నరమేథానికి 76 సంవత్సరాలు - Bairanpally Revolt in Telangana

Bairanpally Martyrs Remembrance Day 2024 : తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లి చరిత్రకెక్కని ఓ నెత్తుటి గాథ. అదో వీరోచిత పోరాటం. సరిగ్గా 76 ఏళ్ల క్రితం జలియన్‌ వాలాబాగ్‌ను మించిన నరమేధం. ఎందరో మట్టి మనుషులు తిరుగుబాటు చేసి అమరులై నేలకొరిగిన వైనం. దోపిడీపై దండయాత్ర జరిపి రజాకారు మూకలపై నిప్పు కణికలై రగిలిన ఈ ఘటనే సాయుధ పోరాటానికి పెద్దఎత్తున సాగేందుకు ఊపిరి పోసింది.

Bairanpally Revolt in Telangana
Bairanpally Revolt in Telangana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 2:20 PM IST

76 Years For Veera Bairanpally Massacre :భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా, తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విమోచనం కలిగింది. స్వాతంత్య్రం వచ్చాక కూడా 13 నెలల పాటు ఈ ప్రాంతం నిజాం రాక్షస పాలనలో కొనసాగింది. వీరికి వ్యతిరేకంగా అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. ఇదే ఏడాది ఆగస్టు 27న జరిగిన బైరాన్‌పల్లి ఘటన చరిత్రకెక్కని గాథగా మిగిలింది. ఆ రోజు గ్రామానికి చెందిన 96 మంది యోధులను ఒకే వరుసలో నిలబెట్టి నిజాం సైనిక అధిపతి ఖాసీం రజ్వి సారథ్యంలో రజాకార్లు కాల్చిచంపారు.

Bairanpally Revolt in Telangana : ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా 76 ఏళ్లు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అరాచకాలు సృష్టించారు. సిద్దిపేట జిల్లాలోని మద్దూరు, లద్నూరు, సలాఖపూర్, రేబర్తి గ్రామాలను రజాకార్లు కేంద్రాలుగా చేసుకొని సమీప గ్రామాల్లో దాడులకు తెగబడుతూ సంపదను దోచుకునేవారు. ఈ అరాచకాలను ఎదిరించేందుకు గ్రామాల్లోని యువతంతా కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డారు. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్టలో ఈ రక్షక దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా పని చేశాయి.

రక్షణకై, పోరుకై స్థావరంగా బురుజు : 1948 ఆగస్టులో రజాకార్లు లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై దాడి జరిపి తగులబెట్టారు. తిరిగివెళ్తున్న క్రమంలో బైరాన్‌పల్లి సమీపంలోకి రాగానే వారిపై సమరయోధులు దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో రక్షణ గెరిల్లా దళాలు దాడిచేసి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో రజాకార్లు బైరాన్‌పల్లి గ్రామంపై మరింత కసి పెంచుకున్నారు. గ్రామస్థులు ఊరి చుట్టూ గోడ ఏర్పాటు చేసి మధ్యలో ఉన్న ఎత్తయిన బురుజును స్థావరంగా చేసుకుని రక్షించుకున్నారు. రజాకార్లు రెండు సార్లు దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు.

ఆగస్టు 27 వేకువజామున అందరూ నిద్రిస్తుండగా, అప్పటి డిప్యూటీ కలెక్టరు హషీం 500 మంది సైన్యంతో దాడి చేశారు. సైనిక ఫిరంగి తూటాలకు బురుజుపై మందు గుండు సామగ్రి నిప్పంటుకొని పేలిపోయింది. సైనికులు గ్రామంలోకి చొరబడి అందరినీ విచక్షణారహితంగా కాల్చి చంపారు. బురుజుపై తలదాచుకున్న 40 మందిని, పలుచోట్ల దొరికిన 56 మంది యువకులను బంధించి ఊరి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లి కాల్చి చంపారు. ఈ ఘటనే సాయుధ పోరాటానికి ఉవ్వెత్తున సాగేందుకు ఊపిరి పోసింది. అదే ఏడాది సెప్టెంబర్ 17న అప్పటి దేశ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ సైనిక చర్యతో తెలంగాణకు విమోచనం కలిగింది.

జలియన్​ వాలాబాగ్​.. స్వాతంత్ర్యోద్యమంలో కీలక మలుపు

జాతి వజ్రాలు జాగృత తేజాలు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరులు

ABOUT THE AUTHOR

...view details