483 Metric Tons Of Rice Found in Vizag :'రేషన్ బియ్యం స్మగ్లింగ్' రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారిన అంశం. ఓ వైపు చౌక బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా పాతాళం వరకు పాతుకుపోయిన మాఫియా మాత్రం అసలు లెక్కచేయడం లేదు. మిల్లుల్లో అక్రమంగా ఉంచిన బియ్యం నిల్వలను అధికారుల కళ్లుగప్పి బోర్డర్ దాటించేస్తున్నారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో రూటు మార్చిన బియ్యం దొంగలు విశాఖ పోర్టును అడ్డాగా మార్చుకున్నారు. తాజాగా కంటెయినర్‌లో 483 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడటం అక్రమాలకు అద్దం పడుతోంది.
ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి :రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఏమాత్రం బెదరడం లేదు. గత ప్రభుత్వంలో గ్రీన్ ఛానల్ పేరుతో పాతుకుపోయిన వైఎస్సార్సీపీ నేతలే ఇప్పుడూ మాఫియాను ముందుండి నడిపిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అనేక చోట్ల రేషన్ బియ్యం సీజ్ చేస్తున్నా లెక్కచేయకుండా టన్నుల కొద్దీ బియ్యాన్ని మిల్లుల్లో నిల్వచేస్తున్నారు. స్థానిక నేతలు, అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
రెండు, మూడు రోజుల్లో కాకినాడకు సిట్ బృందం - రేషన్ మాఫియాలో గుబులు
పోర్టుల్లో ఆకస్మిక తనిఖీలు :కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన తర్వాత రేషన్ బియ్యం అక్రమాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రేషన్ అక్రమాలను అడ్డుకుంటున్నారు. బియ్యం దందాను అరికట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తరచుగా పోర్టుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న పల్నాడు, గుంటూరు జిల్లాల్లోనూ మిల్లుల్లో పరిశీలించగా భారీగా చౌకబియ్యం పట్టుబడ్డాయి. సోమవారం విశాఖపట్నం పోర్టు కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్‌లో మంత్రి తనిఖీలు చేయగా 483 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఆ బియ్యం మూలాలు ఎక్కడివి? ఎక్కడికి తరలించనున్నారు అనే విషయాలను మంత్రి వెల్లడించారు.
చౌకబియ్యం సీజ్ :డిసెంబరు 5న ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో 15 వందల బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు తదితర జిల్లాల్లోనూ ఇటీవల భారీగా చౌక బియ్యం పట్టుబడ్డాయి. బాపట్ల జిల్లాలోని పలు రైస్‌మిల్లుల నుంచి మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాలకు అక్రమ రవాణా, రీసైక్లింగ్ జరుగుతున్నట్లు తేలింది. పలుచోట్ల విజిలెన్స్ బృందాలూ చౌకబియ్యాన్ని సీజ్ చేస్తున్నాయి.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - కాకినాడ పోర్టు 'పుష్ప' ఎవరు?
రీసైక్లింగ్ చేసి సరఫరా : పేదల నుంచి కొనుగోలు చేసే రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి కస్టమ్ మిల్డ్ రైస్ - సీఎంఆర్ కింద మళ్లీ పౌరసరఫరాల శాఖకే పంపిస్తున్నారు. మిల్లుల్లో విద్యుత్తు వాడకం వివరాలను పరిశీలిస్తే అక్కడ మిల్లింగ్ జరిగిందో లేదో తెలుస్తుంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్‌కు ఇచ్చేటప్పుడే ప్రతి నెలా విద్యుత్తు వాడకం వివరాలు సమర్పించాలన్న నిబంధన పెడితే రైతుల ధాన్యాన్ని మర పట్టించి ఇస్తున్నారా? రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారా అన్నది తెలుస్తుంది. అయితే అధికారులు ఇందుకు అంగీకరించడం లేదు. తమకు సహకరించే రైస్‌మిల్లర్లు ఎలాంటి బియ్యం పంపినా, నిబంధనల మేరకు ఉన్నాయంటూ సేకరిస్తున్నారు. కమీషన్లు ఇవ్వకపోతే బియ్యం బాగోలేవంటూ మిల్లర్లను వేధించడం వారి బ్యాంకు గ్యారంటీలు మినహాయించుకుని ముప్పుతిప్పలు పెడుతున్నారన్న విమర్శలున్నాయి.
అలా చేస్తే అడ్డుకట్ట వేయవచ్చు : రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ బియ్యం పట్టుబడితే ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధిత వాహనాలను పోలీసులు వెంటనే వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై 6-A కేసులు మాత్రమే కావడంతో మాఫియాకు భయం లేకుండాపోయింది. అక్రమార్కులకు సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపైనా ఎలాంటి కేసులూ నమోదు కావడం లేదు. ప్రభుత్వం ఇటీవల వేసిన సిట్‌ను కాకినాడలో నమోదైన కేసుల విచారణకు మాత్రమే పరిమితం చేసింది. సిట్ పరిధిని విస్తరిస్తేనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన మాఫియాకు అట్టుకట్ట వేయొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బియ్యం మాఫియాలో సీనియర్ల హస్తం - అదే బాధ కలిగించింది: నాదెండ్ల