Sarannavarathrulu Celebration On Indrakeeladri :ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీ దేవి ప్రసిద్ధి. మహత్తర శక్తిగల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలిగా దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నేడు పలువురు ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హరినాథ్, జస్టిస్ దుర్గాప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), సీపీ రాజశేఖర్‌బాబు తదితరులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శోభ - Dasara Celebrationson Indrakeeladri