Team India 16 hours Journey:టీ 20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి విశ్వ విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లు బార్బడోస్ నుంచి 16 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత గురువారం స్వదేశంలో అడుగు పెట్టారు. ఈ నెల 29న ప్రపంచకప్‌ను గెలిచిన తర్వాత తుపాను కారణంగా 5రోజులు అక్కడే ఉన్న టీమ్ఇండియా ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం బయల్దేరింది. అయితే ఈ 16 గంటల ప్రయాణంలో విమానంలో భారత ఆటగాళ్లు చిన్నపిల్లల్లా సందడి చేశారు.
ప్రపంచకప్పును తనివితీరా చూస్తూ ఓ వైపు మురిసిపోతూనే మరోవైపు దాన్ని సాధించేందుకు పడిన కష్టాన్ని గుర్తుచేసుకొని ఎమోషనలయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ చిన్నపిల్లాడిలా విమానంలో సందడి చేశాడు. మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్ ఆ కప్పును తమ సీటు పక్కనే పెట్టుకుని అలా చూస్తూ ఉండిపోయారు.
ఇక విరాట్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. పంత్ ఆ ట్రోఫీతో డ్యాన్స్ చేశాడు. ఇక పేసర్ జస్ర్పీత్ బుమ్రా తన కుమారుడు అంగద్ బుమ్రాకు ట్రోఫీని చూపుతూ మురిసిపోయాడు. మహ్మద్ సిరాజ్ కప్పును చూస్తూ దాన్ని సాధించేందుకు తాము ఎంత కష్టపడ్డామో చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ప్రపంచకప్‌ను సాధించిన జట్టులో భాగస్వామిని కావడం తన అదృష్టమని సిరాజ్ అన్నాడు. అర్షదీప్ కుమార్ కూడా తమ తల్లిదండ్రులతో కలిసి ఓ స్పెషల్ ఫొటో తీసుకున్నాడు. ఇలా ప్లేయర్లందరూ ఆ కప్‌తో తమ స్పెషల్ మూమెంట్స్ పంచుకున్నారు. ఇదంతా రికార్డు చేసిన బీసీసీఐ టీమ్ ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా క్రికెట్ అభిమానుల కోసం షేర్ చేసింది.