Suhas Yathiraj Paralympics 2024:పారిస్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఈ క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సుహాస్ యతిరాజ్ రజతం దక్కించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో లుకస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో 9-21, 13-21 తేడాతో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక టోక్యోలో కూడా సిల్వర్ సాధించిన యతిరాజ్, తాజాగా పారిస్‌లోనూ రజతంతో మెరిశాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన భారత తొలి పారా అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఇక విశ్వ వేదికపై రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సుహాస్ యతిరాజ్పై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. అతడి ఆటతీరును కొనియాడుతూ చాలా మంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
అయితే ఈయన బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకుంటే ఆయన కేవలం బ్యాడ్మింటన్ ప్లేయర్ మాత్రమే కాదు ఉత్తర్‌ప్రదేశ్ ఐఏఎస్ అధికారి కూడా. ఆ రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ అధికారిగానూ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, సుహాస్ భార్య రీతూ సుహాస్ కూడా ఐఏఎస్ అధికారిణే. ఆమె అర్బన్ డెవలప్‌మెంట్ ఫీల్డ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రీతూ 2019లో మిసెస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు.